పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ
సందర్భం- నేడు వరలక్ష్మీవ్రతం
మహిళలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఇళ్లలోనూ, గుళ్లలోనూ, సామూహికంగానూ జరుపుకునే పండుగ వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాని, ఆ మాసంలోని రెండవ శుక్రవారం కాని ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ రెండు వారాలు కుదరని వారు పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారంనాడైనా సరే ఈ వ్రతం జరుపుకోవచ్చు.
పూజావిధానం
వ్రతం చేసేరోజు ఉదయాన్నే లేచి తలంటిస్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిముంగిట కళ్లాపు చల్లి, ముగ్గుపెట్టి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరించాలి. ఇంట్లో ఇల్లాలు శుచిగా, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం విఘ్న నివారణకై గణపతి పూజ చేయాలి.
ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని పూజకు మాత్రమే ఉపయోగించే ఒక పంచపాత్రనుగాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి కలశపూజ చేసుకోవాలి.
అనంతరం ఒక అతి ముఖ్యమైన అధికారి లేదా అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమి చేస్తామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం... ముందుగా వారిని సాదరంగా ఆహ్వానించి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిచ్చి, కూర్చోవడానికి ఆసనం ఇచ్చి, తాగడానికి నీళ్లిస్తాం. ఆ తర్వాత సాదరంగా భోజానికి ఆహ్వానించి, రుచిగా, శుచిగా చేసిన పిండివంటలను ఆత్మీయంగా వడ్డించి, దక్షిణతో కూడిన తాంబూలమిచ్చి, విశ్రమింపజేస్తాం.
ఆ తర్వాత వారు తిరిగి వెళ్లేటప్పుడు పిండివంటలో, ఇతర వస్త్రాభరణాలో ఇచ్చి, ఘనంగా వీడ్కోలు చెబుతాం. అటువంటిది... సాక్షాత్తూ వరాలనిచ్చే వేలుపు, సకల సంపదలనూ ప్రసాదించే చల్లని తల్లి మన ఇంటికి వచ్చినప్పుడు మనం మరింత భక్తిశ్రద్ధలతో ఆమెను ఆహ్వానించడమే ఆవాహన. ఆ తర్వాత మిగిలినవన్నీ షోడశోపచార పూజలు. అమ్మవారిని మన ఇంటి ఆడపడచుగా భావించి, ప్రేమగా ఆహ్వానించి, పైన చెప్పుకున్న విధంగా ఆమెను శ్రద్ధాభక్తులతో పూజిస్తే ఆమె అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. మనకు వచ్చిన రీతిలో అమ్మవారిని పూజించి, చివరలో ముమ్మారు ప్రదక్షిణ చేయాలి.
నమస్కారం
నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి అంటూ అమ్మవారికి అక్షతలు సమర్పించి నమస్కరించాలి. తోరం కట్టుకున్న తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకోవాలి. ఈ కథ విని అక్షతలు శిరసుపై ఉంచుకోవాలి. ఆ తరువాత ముత్తయిదువలకు పండ్లు, తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి, ఆనందించాలి.
- డి.శ్రీలేఖ