ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
♦ ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
♦ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
సంగారెడ్డి జోన్/ మున్సిపాలిటీ : సంగారెడ్డి డివిజన్‌లోని ఆలయాలన్నీ శుక్రవారం మహిళలతో కిక్కిరిశాయి. శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం వీరభద్రనగర్‌లోని లక్ష్మీదేవి ఆలయం, వీరభద్రస్వామి ఆలయం, ఇస్మాయిల్ ఖాన్‌పేట శ్రీ దుర్గా భవానీ మాతా ఆలయాల తోపాటు ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. లక్ష్మీదేవి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఇంటింటా వరలక్ష్మీ మహిళలు వ్రతాలు నిర్వహించారు. ఇరుగు,పొరుగు మహిళలకు వాయనం ఇచ్చి పుచ్చుకున్నారు. శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీదేవిని ఆహ్వానించారు.
ఇస్మాయిల్ ఖాన్‌పేటలోని శ్రీ దుర్గా భవానీ మాత ఆలయంలో మన గుడి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఆలయాల్లో ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద సంక్‌యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపించింది. వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.