సందేశాత్మకంగా ‘పున్నామ నరకం’
వీరవాసరం : వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో చిలకమర్తి కళాప్రాంగణంలో గుండా లక్ష్మీరత్నావతి కళావేదికపై ప్రదర్శిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీలు ఆకట్టుకుంటున్నాయి. రసధ్వని గ్రామీణ సాంస్కృతిక సేవా సమితి శ్రీకాకుళం కళాకారులు ప్రదర్శించిన ‘పున్నామ నరకం’ నాటిక సందేశాత్మకంగా సాగింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని, కుమారులు పట్టించుకోని వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితిని అద్దం పడుతూ నాటిక సాగింది. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే నమ్మకంతో తల్లిదండ్రులు అబ్బాయిలకు ప్రాధాన్యమిస్తున్నారని, వృద్ధాప్యంలో ఆసరాగా ఉండని కుమారులు కంటే పున్నామ నరకమే మేలనే సందేశంతో నాటిక సాగింది. అనంతరం కేకేఆర్ కల్చరల్ అసోసియేషన్ సికింద్రాబాద్ కళాకారులు ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక ప్రదర్శించారు. సమాజంలో మత విద్వేషాలు పెరుగుతున్న నేపథ్యంలో మతం కంటే మానవత్వం గొప్పదనే సందేశంతో నాటిక సాగింది.