దుబ్బాక బరిలో విజయశాంతి?
దుబ్బాక టౌన్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరు ఖారారైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉందని.. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న నాయకులను బరిలో దింపితే గెలుపు కష్టమేనని భావించిన పార్టీ అధిష్టానం, విజయశాంతిని రంగంలో దింపితే గెలుపు అవకాశాలుంటాయన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయశాంతికి తెలపడంతో ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి బరిలో ఉండటంతో పాతకాపులకు టికెట్ ఇస్తే గెలుపు డౌటేనని ఇటీవల కాంగ్రెస్ సర్వేల్లో వెల్లడైనట్లు తెలిసింది.
మహాకూటమి దుబ్బాక టికెట్‌పై పట్టుబడుతుండటం.. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డితోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఏంజేబీ ట్రస్టు అధినేత మద్దుల నాగేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి పన్యాల శ్రావణ్‌కుమార్‌రెడ్డిలు జోరుగా యత్నాలు చేస్తుండటంతో టికెట్ ఎవరికి వస్తుందో అర్థంకాక కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నా రు. ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికిచ్చినా మిగతా ఇద్దరు సహకరించడం కష్టమేనని భావించిన అధిష్టానం తెరపైకి విజయశాంతి పేరును తెరపైకి తెచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ కమిటీకి ఇచ్చిన జాబి తాలో విజయశాంతి పేరు కూడా ఉందని మాట్లాడుకుంటున్నారు. విజయశాంతి కూడా మంగళవారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుబ్బాక నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం ఇదంతా వాస్తవం కాదని.. తమకే టికెట్ వస్తుందంటూ చెప్పుకుంటున్నారు.