కిలాడీ లేడీ ఆట కట్టు
న్యూఢిల్లీ: కోట్ల రూపాయలు దండుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కిలాడీ లేడీ ఆట కట్టించారు పోలీసులు. దక్షిణ బెంగళూరు కు చెందిన విశాలాక్షిభట్(42)ను బెంగళూరు పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు.
జెపినగర్లో నివసిస్తున్న విశాలాక్షి బెంగళూరు సహా కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులను మోసం చేసింది. హెచ్ డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్సూరెన్స విభాగం మేనేజర్‌గా పరిచయం చేసుకుని ఏకంగా సినీ ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలనే బురిడీ కొట్టించింది. తన ఖాతాలో సొమ్ము డిపాజిట్ చేస్తే 5 శాతం ఇన్సూరెన్స్ వడ్డీ వస్తుందని, షేర్ల ద్వారా లాభాలు చెల్లిస్తామని ఈ అవకాశం తన కంపెనీకి మాత్రమే ఉందని వారిని నమ్మించింది. ఇలా 60 మందికి సుమారు రూ.30 కోట్ల మేరకు కుచ్చు టోపీ పెట్టింది.
నవంబర్ మొదటి వారంలో తన భార్య కనిపించడంలేదంటూ విశాలాక్షి భర్త శ్రీకాంత హెగ్డే ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 60మంది బాధితులు, తమను చీట్ చేసిందంటూ జెపినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆమె బండారం బయటపడింది. మూడుకోట్లకు పై మోసపోయామని ఐదుగురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు.
బాధితుల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ పిఎ శ్రీనివాస్, సుమలత సోదరి, రూ. 72 లక్షలకు పైగా ముట్టచెప్పిన రేణుకాదేవి కూడా ఉన్నారు. విశాలాక్షి అరెస్టును పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. తమ కళ్లుగప్పి తప్పించుకుతిరుగుతున్న ఆమెను ఆరెస్టు చేశామని త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఆమెను ఢిల్లీనుంచి తీసుకువచ్చి విచారణ జరుపుతామని సౌత్ డీసీపీ లోకేశ్‌కుమార్ తెలిపారు.