ముగ్గురు ముదుర్లు వ్యాపారులపై వసూళ్ల వల
డబ్బు కోసం ఎంతటి ఘోరానికైనా పాల్పడే విక్రమ్ పారస్, నీరజ్ బవానా, అనిల్ గాంజా పేర్లను 2014లో ‘అత్యంత కరడుగట్టిన’ నేరస్తుల జాబితాలో చేర్చినట్టు పోలీసులు ప్రకటించారు. సంపన్నశ్రేణి వ్యాపారులు, రియల్టర్ల దగ్గరి నుంచి బలవంతంగా డబ్బు గుంజడం, అవసరమైతే హతమార్చడాన్ని వృత్తిగా పెట్టుకున్న ఈ కిరాతకుల తలలపై రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించారు.
న్యూఢిల్లీ:విక్రమ్ పారస్, నీరజ్ బవానా, అనిల్ గాంజా.. ఈ ముగ్గురి పేర్లు వింటే ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీఆర్) వ్యాపారులకే కాదు.. నగర పోలీసులకూ ముచ్చెమటలు పడుతున్నాయి. డబ్బు కోసం ఎంతటి ఘోరానికైనా పాల్పడే వీళ్లు, అత్యంత ప్రమాదకర నేరస్తులని అధికారులు చెబుతున్నారు. సంపన్నశ్రేణికి చెందిన వ్యాపారులు, రియల్టర్ల దగ్గరి నుంచి బలవంతంగా డబ్బు గుంజడం, అవసరమైతే హతమార్చడం వీరి వృత్తి. ఎన్నో హత్యలు, బలవంతపు వసూళ్ల కేసుల్లో నిందితులైన విక్రమ్ పారస్, నీరజ్ బవానా, అనిల్ గాంజాను పట్టించిన వారికి రూ.లక్ష చొప్పున నజరానా చెల్లిస్తామని ఢిల్లీ పోలీసుశాఖ ప్రకటించింది. నగరంలో 2014లో ‘అత్యంత కరడుగట్టిన’ 10 మంది నేరస్తుల జాబితాలోని తొలి మూడు పేర్లు వీరివే అంటే ఈ ముగ్గురు ఎలాంటి వాళ్లో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
29 ఏళ్ల పారస్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండగా, బవానా, గాంజా మిగతా రెండుస్థానాల్లో ఉన్నారని క్రైంబ్రాంచ్ అధికారులు ప్రకటించారు. తదనంతర స్థానాల్లో సత్యవాన్, కసీముల్లా తదితరులు ఉన్నారు. షార్ప్షూటరైన కసీముల్లా పలు హత్యలు, బలవంతపు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘ఈ జాబితాకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం. వీరిలో కొందరు ఘరానా నేరగాళ్లే అయినా, వాళ్లపై ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి’ అని క్రైంబ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. పారస్, గాంజా హర్యానా వాసులు కాగా, బవానా ఢిల్లీలోని బవానా ప్రాంతవాసి. ఈ ముగ్గురిపై 2010 నుంచి 2013 వరకు దాదాపు 16 కేసులు నమోదయ్యాయి. ‘పారస్, బవానా, గాంజా తమను తామే ముఠానాయకులుగా ప్రకటించుకున్నారు. వ్యాపారులు, ప్రజలను భయపెట్టి డబ్బుగుంజే చిల్లర నేరగాళ్లతో కలసి వీళ్లు పనిచేస్తుంటారు. నైరుతి, ఔటర్ ఢిల్లీలోని వ్యాపారులపై ఈ ముఠాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి’ అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
మళ్లీ ఏకమైన పలు ముఠాలు
ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఈ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నప్పుడల్లా క్రైంబ్రాంచ్, స్పెషల్‌సెల్ పోలీసులు అప్రమత్తమై, తగు చర్యలు తీసుకుంటున్నారు. పేరుమోసిన నేరగాడు నీతూ దబోడియా మృతి తరువాత కూడా పారస్ అగ్రస్థాయి గ్యాంగ్‌స్టర్‌గా కొనసాగుతున్నాడని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీసు అధికారి ఒకరు అన్నారు. ఘరానా నేరగాడు దబోడియా, ఇతని అనుచరులు ఇద్దరు గత ఏడాది అక్టోబర్‌లో వసంత్‌కుంజ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతి చెందిన అనుచరుల పేర్లు కూడా ఢిల్లీ పోలీసుల నేరగాళ్ల జాబితాలో కనిపించాయి. ‘అత్యంత కరడుగట్టిన’ 10 మంది నేరస్తుల జాబితాలో ఉన్న వికాస్, మనోజ్, వీరి అనుచరులు వివేక్, ప్రవీణ్ మాత్రం ఇది వరకే పోలీసులకు చిక్కారు.
దబోడియా వంటి గ్యాంగ్స్టర్లను హతమార్చడం ద్వారా ఢిల్లీ పోలీసులు మిగతా నేరగాళ్లలో భయాన్ని పెంచగలిగారు. దీంతో కొంతమంది కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్నా.. ముఠాలన్నీ తిరిగి ఏకమై నేరాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ‘అత్యంత క్రూరంగా నేరాలకు పాల్పడే వారిని ఈ జాబితాలో చేర్చుతున్నాం. వీళ్లు పలుసార్లు పోలీసులను ఏమార్చి తప్పించుకున్నారు’ అని మరో అధికారి ఈ సందర్భంగా వివరించారు. వీరిని అరెస్టు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలూ కొనసాగుతున్నాయని చెప్పారు.