welfare of Dalits
-
ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా వారికి లబ్ధి చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దళితులు ఎన్నో దశాబ్దాల నుంచి కోరుకుంటున్న శ్మశాన వాటికల సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని ప్రాంతాల్లోని ఎస్సీలు.. వాటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులను చాలా ఏళ్లుగా కోరుతున్నా, ఏ ప్రభుత్వం ఇంత వరకు సీరియస్‌గా దృష్టి సారించలేదు. అయితే ఇటీవలి కాలంలో ఎవరూ అడగక పోయినా, తొలిసారిగా సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో దళితులకు శ్మశాన వాటిక లేని గ్రామం ఉండకూడదనే లక్ష్యంతో అధికార యంత్రాంగానికి కార్యాచరణ నిర్దేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దళితులకు శ్మశాన వాటిక అవసరం ఉన్న గ్రామాలను, అందుకు తగిన భూమిని గుర్తించి, వెంటనే సమాచారం ఇవ్వాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఇలా.. ► శ్మశాన వాటికల అవసరం ఉన్న గ్రామాలను, వాటి ఏర్పాటుకు జనాభానుబట్టి అర ఎకరం నుంచి ఎకరం స్థలాన్ని తొలుత గుర్తించాలి. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ స్థలాన్ని పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు వెంటనే పూర్తి చేయాలి. ► అనంతరం ఆ భూమిని శ్మశాన వాటికగా అభివృద్ధి చేయడం, రెవెన్యూ రికార్డులను అప్‌గ్రేడ్ చేయడం వంటి పనులు పూర్తి చేయాలి. ఇవన్నీ ముగిశాక శ్మశాన వాటికలను లాంఛనంగా ప్రారంభించాలి. ► ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూములు లేకపోతే ప్రత్యామ్నాయాలు చూడాలి. ఆ గ్రామ సమీపంలోని రైతుల నుంచి భూమిని సేకరించి, వేరే చోట వారికి భూమి ఇవ్వడం (ఎక్సేంజ్) వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. 45 రోజుల కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ► ఈ అంశంపై రెవెన్యూ శాఖ ప్రతివారం జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించి, శ్మశాన వాటికల అవసరం ఉన్న గ్రామాలు, అందుబాటులో ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది. కొన్ని జిల్లాల నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు నివేదికలు అందాయి. నాలుగైదు రోజుల్లో మిగిలిన జిల్లాల నుంచి కూడా సమాచారం అందనుంది. -
27న అఖిల పక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ’సీఎం దళిత సాధికారత’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం ఈ నెల 27న ప్రగతి భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం ప్రారంభంకానున్న ఈ సమావేశం రోజంతా కొనసాగనుంది. అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల శాసనసభా పక్షనేతలు కూడా పాల్గొంటారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు పంపించనున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభధ్రంకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి కోరారు. దళితుల సమస్యల పట్ల అవగాహన కలిగి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను ఆహ్వానించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దళితుల సంక్షేమానికి సర్కారు కృషి ‘నూతన తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మారుమూలన ఉన్న దళితులు తమ జీవితాల్లో గుణాత్మక అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో, ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం.’ అని కేసీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల విరామం తర్వాత రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి. తొలిసారిగా 2014 డిసెంబర్ 16న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు అంశంపై రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష భేటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. 2017 జనవరి 27న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. కానీ ఇందులో కొన్ని పార్టీల నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఇది అఖిలపక్ష భేటీ అని ప్రభుత్వం కూడా చెప్పుకోలేదు. అయితే అసైన్డ్ భూముల సమస్యలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇప్పుడు సుమారు ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: ఈడీ విచారణకు హాజరుకాని ఎంపీ నామా -
దళితుల సంక్షేమానికి కృషి
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 58వ వర్ధంతి వేడుకలను ఆదిలాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆనాడే చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో ప్రజలు అభివృద్ధి చెందుతారని పేర్కొని ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద దళిత మహిళ కుటుంబాలకు ఆదుకోవడానికి 3 ఎకరాల వ్యవసాయ భూమిని అందిస్తుందని తెలిపారు. సొంత ఖర్చుతో అంబేద్కర్ విగ్రహం తయారు చేయించి రాబోయే అంబేద్కర్ జయంతి రోజు నాటికి ప్రతిష్టిస్తామని చెప్పారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి కైలాస్‌నగర్ వరకు ర్యాలీగా వెళ్లారు. షెడ్యుల్ కులాల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు ప్రజ్ఞకుమార్, ప్రధాన కార్యదర్శి సోగల సుదర్శన్, డాక్టర్ బీఆర్ అంబేద్కర మెమోరియల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబు, సత్యవన్, బౌద్ధ మహాసభ జిల్లా అద్యక్షుడు గంగారాం, గణేశ్ మెకాలే, సంత్ సైనిక్ దళ్ సభ్యులు దీపక్ వాగ్మారే, పాటిల్, అంబేద్కర్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు రమాబాయి, ప్రధాన కార్యదర్శి కమలాబాయి, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు దయానంద్ గైక్వాడ్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుడు దుర్వ సంజయ్, ఆదిలాబాద్ జెడ్పీటీసీ అశోక్, మావల సర్పంచ్ రఘుపతి పాల్గొన్నారు. కలెక్టర్ నివాళులు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ జగన్మోహన్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.