ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 58వ వర్ధంతి వేడుకలను ఆదిలాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆనాడే చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో ప్రజలు అభివృద్ధి చెందుతారని పేర్కొని ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద దళిత మహిళ కుటుంబాలకు ఆదుకోవడానికి 3 ఎకరాల వ్యవసాయ భూమిని అందిస్తుందని తెలిపారు.
సొంత ఖర్చుతో అంబేద్కర్ విగ్రహం తయారు చేయించి రాబోయే అంబేద్కర్ జయంతి రోజు నాటికి ప్రతిష్టిస్తామని చెప్పారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి కైలాస్‌నగర్ వరకు ర్యాలీగా వెళ్లారు. షెడ్యుల్ కులాల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు ప్రజ్ఞకుమార్, ప్రధాన కార్యదర్శి సోగల సుదర్శన్, డాక్టర్ బీఆర్ అంబేద్కర మెమోరియల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబు, సత్యవన్, బౌద్ధ మహాసభ జిల్లా అద్యక్షుడు గంగారాం, గణేశ్ మెకాలే, సంత్ సైనిక్ దళ్ సభ్యులు దీపక్ వాగ్మారే, పాటిల్, అంబేద్కర్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు రమాబాయి, ప్రధాన కార్యదర్శి కమలాబాయి, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు దయానంద్ గైక్వాడ్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుడు దుర్వ సంజయ్, ఆదిలాబాద్ జెడ్పీటీసీ అశోక్, మావల సర్పంచ్ రఘుపతి పాల్గొన్నారు.
కలెక్టర్ నివాళులు
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ జగన్మోహన్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దళితుల సంక్షేమానికి కృషి
Published Sun, Dec 7 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement