సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా వారికి లబ్ధి చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దళితులు ఎన్నో దశాబ్దాల నుంచి కోరుకుంటున్న శ్మశాన వాటికల సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని ప్రాంతాల్లోని ఎస్సీలు.. వాటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులను చాలా ఏళ్లుగా కోరుతున్నా, ఏ ప్రభుత్వం ఇంత వరకు సీరియస్గా దృష్టి సారించలేదు.
అయితే ఇటీవలి కాలంలో ఎవరూ అడగక పోయినా, తొలిసారిగా సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో దళితులకు శ్మశాన వాటిక లేని గ్రామం ఉండకూడదనే లక్ష్యంతో అధికార యంత్రాంగానికి కార్యాచరణ నిర్దేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దళితులకు శ్మశాన వాటిక అవసరం ఉన్న గ్రామాలను, అందుకు తగిన భూమిని గుర్తించి, వెంటనే సమాచారం ఇవ్వాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఇలా..
► శ్మశాన వాటికల అవసరం ఉన్న గ్రామాలను, వాటి ఏర్పాటుకు జనాభానుబట్టి అర ఎకరం నుంచి ఎకరం స్థలాన్ని తొలుత గుర్తించాలి. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ స్థలాన్ని పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు వెంటనే పూర్తి చేయాలి.
► అనంతరం ఆ భూమిని శ్మశాన వాటికగా అభివృద్ధి చేయడం, రెవెన్యూ రికార్డులను అప్‌గ్రేడ్ చేయడం వంటి పనులు పూర్తి చేయాలి. ఇవన్నీ ముగిశాక శ్మశాన వాటికలను లాంఛనంగా ప్రారంభించాలి.
► ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూములు లేకపోతే ప్రత్యామ్నాయాలు చూడాలి. ఆ గ్రామ సమీపంలోని రైతుల నుంచి భూమిని సేకరించి, వేరే చోట వారికి భూమి ఇవ్వడం (ఎక్సేంజ్) వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. 45 రోజుల కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
► ఈ అంశంపై రెవెన్యూ శాఖ ప్రతివారం జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించి, శ్మశాన వాటికల అవసరం ఉన్న గ్రామాలు, అందుబాటులో ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది. కొన్ని జిల్లాల నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు నివేదికలు అందాయి. నాలుగైదు రోజుల్లో మిగిలిన జిల్లాల నుంచి కూడా సమాచారం అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment