కానిస్టేబుల్స్ రాతపరీక్షకు పకడ్బందీ చర్యలు
-మొత్తం పరీక్ష కేంద్రాలు: 43
- హాజరుకానున్న అభ్యర్థులు: 23.095
- నేటి ఉదయం 10 గంటల నుంచి ఒకటి దాకా పరీక్ష
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ఆదివారం నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించారు. శనివారం పోలీసు అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షల నిర్వహణ బాధ్యత జేఎన్టీయూ తీసుకుందన్నారు.
జిల్లాలో అనంతపురం, గుత్తి, పామిడి పట్టణాల్లో మొత్తం 43 కేంద్రాల్లో 23,095 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని, ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకూ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. లేకపోతే దేహధారుడ్య, తదితర పరీక్షలకు అర్హత కోల్పోతారన్నారు. డీఎస్పీలు మల్లికార్జున, ఖాసీంసాబ్, మల్లికార్జునవర్మ, రవికుమార్, నాగసుబ్బన్న, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, పలువురు సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్టీం సభ్యులు పాల్గొన్నారు.