కాజేయ్.. దాచెయ్!
అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్నారు కొందరు దళారులు. హోదా, ఉద్యోగం, డబ్బు ఎర చూపి కొందరు, చిట్టీల వ్యాపారం పేరుతో కొందరు వారిని నిలువునా ముంచుతున్నారు. ఇలా వైట్‌కాలర్ నేరాలకు మిర్యాలగూడ అడ్డాగా మారింది. ఇక్కడ అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కాజేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు.
- న్యూస్‌లైన్, మిర్యాలగూడ
నెల రోజుల కాలంలోనే మిర్యాలగూడ కేంద్రంలో పలు వైట్ కాలర్ నేరాలు చోటు చేసుకున్నాయి. దాంతో ఎంతో మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోయారు. మిర్యాలగూడ పట్టణంలోని ఇండస్ఇండ్ బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ చైతన్య నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చి ఖాతాదారుల నుంచి 42 లక్షల రూపాయలు కాజేశాడు. ఈ విషయం బ్యాంకు రీజినల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. నకిలీ పత్రాలు ఇచ్చిన విషయం బ్యాంకు అధికారుల లెక్కల్లో తేలినా.. ఖాతాదారులకు ఖాళీ చెక్కులు ఇవ్వడంతోపాటు ఎలాంటి రశీదులూ ఇవ్వకుండా సుమారుగా 1.80 కోట్ల రూపాయలు కాజేసినట్లు సమాచారం. సోమవారం బాధితులు కొంతమంది బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. మరికొంతమంది ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారని సమాచారం. మోసపోయిన ఖాతాదారుల్లో పట్టణానికి చెందిన కొంతమంది రైస్ మిల్లర్లు, డాక్టర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.
ఉద్యోగాల పేరిట మోసం..
ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తిపై గత నెలలో హుజూర్‌నగర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ పట్ణణానికి చెందిన ఒక వ్యక్తి వివిధ శాఖలలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద 1.25 లక్షల రూపాయల చొప్పున రూ.38 లక్షలు వసూలు చేశారు. కాగా సంవత్సరాలు గడిచినా ఉద్యోగాలిప్పించకపోవడంతో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పది రోజుల క్రితం చిట్టీల వ్యాపారం చేస్తున్న ఓ మహిళ సుమారుగా కోటి రూపాయలతో పరారీ అయ్యింది. కాగా ఆమె వద్ద చిట్టీలు వేసేవారంతా మహిళలే. వారంతాలబోదిబోమని మొత్తుకున్నా విషయం పోలీసుల వరకు వెళ్లలేదు. అదే విధంగా నెల రోజుల క్రితం సీతారాంపురానికి చెందిన మరో మహిళ సుమారు 10 లక్షల రూపాయల వరకు అప్పులు చేసి పరారీ అయినట్లు తెలిసింది.
బీసీల పేరుతో అధిక వడ్డీలు..
పట్టణంలో వడ్డీ వ్యాపారులు విపరీతంగా పెరిగిపోయారు. బార్కటింగ్ (బీసీ)ల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు ఉదయం వేళలో 900 రూపాయలు ఇచ్చి సాయంత్రం వేళలో రూ.వెయ్యి తీసుకుంటున్నారు. అంతే కాకుండా బడా వ్యాపారులు సైతం లక్షల్లో డబ్బులు బీసీలకు తీసుకుంటున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేని వారినుంచి వ్యాపారులు బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నారు.