దెయ్యం పట్టిందని మహిళను చితకబాదాడు
జైపూర్: దెయ్యం పట్టిందని, దీన్ని వదిలిస్తానని చెప్పి ఓ మాంత్రికుడు చైన్ తీసుకుని మహిళను చితకబాదాడు. రాజస్థాన్‌లో రాజసమండ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
32 ఏళ్ల కస్ని అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆమెకు దెయ్యం ఆవహించిందని, దీన్ని వదిలించేందుకు వైద్యం చేయాలని మాంత్రికుడు చెప్పాడు. బుధవారం రాత్రి మంత్రాల పేరుతో ఆమెను రెండు గంటలకుపైగా ఇనుప చైన్‌తో చితకబాదాడు. ఆ తర్వాత ఆమె జట్టు పట్టుకుని ఈడ్చాడు. ఈ దెబ్బలకు ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో, మాంత్రికుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.