మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని యువతులు, మహిళలకు సబల పథకం కింద ఆత్మరక్షణ అంశంలో శిక్షణ ఇవ్వాలని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎ.ఇ.రాబర్ట్స్ కోరారు. ఎంవీపీ కాలనీలో గల సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన సీడీపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శిక్షణ విషయంలో పోలీసుల సహకారం కూడా ఉంటుందని తెలిపారు.
జిల్లాలోని 15 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గర్భిణులు, బాలింతలకు రోజూ పాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకం మంజూరైన ఏడు కొత్త ప్రాజెక్టుల పరిధిలో పాల నిధుల కోసం త్వరగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించాలని కోరారు. జిల్లాలోని 13 ప్రాజెక్టులకు సొంత భవనాలు మంజూరైనందున సీడీపీఓలు రెవెన్యూశాఖ సహకారంతో స్థల సేకరణ వేగవంతం చేయాలని కోరారు. ఇంకా ఆరు భవనాలకు ప్రతిపాదనలు అందాల్సి ఉందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసినందున అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు.
మానసిక వికలాంగులకు ప్రభుత్వం రూ.5 వేలు వంతున నగదు అందజేస్తుందని తెలిపారు. జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గల మానసిక వికలాంగుల వివరాలను తమకు అందజేయాలని కోరారు. సమావేశంలో సంస్థ ఏపీడీ జి.చిన్మయిదేవి, ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ వెంకటేశ్వరి, అర్బన్-2 సీడీపీఓ ఉషారాణి, జిల్లాలోని 23 ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సీఐ మురళి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
2 నుంచి శిక్షణ తరగతులు
అల్లిపురం : విశాఖ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మహిళలకు ‘ఆత్మ రక్షణ మెలకువల’పై శిక్షణ ఇవ్వనున్నట్టు నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్ పి.ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే, జూడో, బాక్సింగ్‌ల్లో ప్రావీణ్యం గల శిక్ష కులతో తగిన శిక్షణ, సిటీ ట్రైనింగ్ సెంటర్ బోధన సిబ్బందితో బాలల న్యాయ చట్టం, పోలీస్ వ్యవస్థ తదితర అంశాలపై అవ గాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్వయంగా గానీ, 0891-2712471లోగానీ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.