మీ మొబైల్ఫోన్లో 9 అంకె నొక్కితే చాలు!
న్యూఢిల్లీ: ఆపత్కాలంలో మహిళలను సత్వరమే ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ముందడుగు వేస్తోంది. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు మొబైల్లోని ఒక్క డిజిట్ (అంకె) గట్టిగా నొక్కినా చాలు పోలీసులకు, తమ సన్నిహితులకు 'ప్యానిక్ అలర్ట్' వెళ్లేవిధంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్ మొబైల్లోని '9' నెంబర్ను గట్టిగా నొక్కడం ద్వారా ఎస్వోఎస్ సందేశం పోలీసులతోపాటు మరో తొమ్మిదిమంది ఎంచుకున్న వ్యక్తులకు వెళుతుంది. ఈ సందేశంలో యూజర్ ఉన్న ప్రదేశం వివరాలు కూడా ఉంటాయి.
స్మార్ట్ఫోన్లో ఈ సర్వీసు అలర్ట్ చాలా ప్రభావంతంగా పనిచేసే అవకాశముంది. అదేవిధంగా మాములు ఫోన్లలోనూ ఈ సర్వీసు అప్గ్రేడ్ చేసే వీలుంది. సాధారణ ఫోన్లలో ఉచితంగా ఈ సర్వీసును అప్గ్రేడ్ చేసేందుకు మొబైల్ ఫోన్ తయారీదారులు, టెలిఫోన్ సర్వీసు ప్రోవైడర్లు ముందుకొచ్చారని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
'ప్రతి మొబైల్ఫోన్లోనూ ఈ సర్వీసు పనిచేస్తుంది. మొబైల్లో ఒక అదనపు బటన్ పెట్టుకోవడం లేదా యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం కంటే మొబైల్ ఫోన్లోని ప్రస్తుత పొగ్రామ్ను అప్గ్రేడ్ చేసుకొని ఈ నూతన సర్వీసును వాడటం మంచింది' అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ఈ మేరకు నూతన సేవలు అందించాలంటూ కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ త్వరలోనే టెలికం ప్రొవైడర్లకు అధికారిక ఆదేశాలు ఇచ్చే అవకాశముంది.