అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
సమిశ్రగూడెం (నిడదవోలు) : మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్ స్టీరింగ్ విఫలమై అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న పుంతలో ముసలమ్మ ఆలయం మీదకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్, ఐదుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి వెళుతుండగా సమిశ్రగూడెం వచ్చేసరికి స్టీరింగ్ విఫలమైంది. దీంతో డ్రైవర్ జి.సుందరబాబు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న పుంతలో ముసలమ్మ ఆలయాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సుందరబాబుతో పాటు బ్రాహ్మణగూడేనికి చెందిన చిన్నం నాగేశ్వరరావు, పెరవలి మండలం ఏలేడుపాడుకు చెందిన పేరిశెట్టి భావనఋషి, కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన షేక్ అమ్మాజీ, తణుకు పట్టణానికి చెందిన మొక్కపాటి సత్యనారాయణ, అతని భార్య సక్కుబాయికు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆలయం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సు ముందు భాగంలోని అద్దాలలో నుంచి ఆలయ కాంక్రీటు దిమ్మలు, రేకులు చొచ్చుకువచ్చాయి. నిడదవోలు రూరల్ ఎస్సై కె.నరేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.