తెలుగుకు ‘చైతన్యం’
బోరివలి, న్యూస్‌లైన్: బోరివలి తూర్పు రాజేంద్రనగర్‌లో ‘బి.ఎల్. చాట్లాన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగు చైతన్య ఉన్నత పాఠశాల మంగళవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో 89 శాతం మార్కులు సాధించి, ముంబైలోని తెలుగు పాఠశాలలన్నింటి కన్నా ముందంజలో నిలిచింది. స్కూల్ టాపర్‌గా బాస శ్రీకాంత్ (89 శాతం), ఇసర్ల రవీంద్ర (77 శాతం) ద్వితీయ స్థానంలో, ఎజెల్లి సునీత (73 శాతం)తో తృతీయస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ చాట్లా గంగాధర్ మాట్లాడుతూ....ముంబైలో మొదటి తెలుగు ఉన్నత పాఠ శాల బోరివలిలోని బృహన్ ముంబై మహానగర పాలిక ఆధ్వర్యంలో ఒకటో తరగతి నుండి 7వ తరగతి వరకు మాత్రమే విద్యాబోధన జరుగుతుండేదన్నారు.
ఆ పై చదువులు చదవాలంటే ఇంగ్లిష్ మీడియం చదవాల్సి వచ్చేది. లేదంటే విద్యార్థులు చదువు మానేసేవారు. అందుకే పేదవిద్యార్థులు పై చదువులు చదువుకునేలా తోడ్పడేందుకు 2004లో 8వ తరగతి ప్రారంభించామన్నారు. తర్వాత 9,10 క్లాసులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రభుత్వపరంగా గాని, ఇతర సంస్థల నుంచిగాని ఎటువంటి సాయం పొందకుండానే పదేళ్లుగా పాఠశాలను విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు. ప్రభుత్వం చొరవ చూపితే పేదవిద్యార్థులకు మెరుగైన విద్య లభించడంతోపాటు, సిబ్బందికి సైతం ఆర్థికవెసులుబాటు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మంచి ఫలితాల సాధన కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను సైతం తీసుకుంటున్నామన్నారు. అలాగే ఆటస్థలం లేకపోవడం వల్ల పక్కనున్న మైదానానికి అద్దె చెల్లించి పిల్లలకు క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నామని గంగాధర్ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ జాగృతి మాట్లాడుతూ స్థానిక తెలుగు సంఘాల నాయకులు ఎవరైనా పాఠశాలలో చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజుల చెల్లించేందుకు ముందుకువస్తే, వారి భవిషత్తును తీర్చిదిద్దినవారవుతారని అభిప్రాయపడ్డారు.
భివండీకే తలమానికం ‘వివేకానంద’..
భివండీ, న్యూస్‌లైన్: పదోతరగతి పరీక్షా ఫలితాల్లో పద్మనగర్ ప్రాంతానికి చెందిన వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ హ్యాట్రిక్ సాధించి సత్తాచాటింది. పట్టణవ్యాప్తంగా వందశాతం ఫలితాలు సాధించిన ఆరు పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో ఈ పాఠశాలను ప్రారంభించారు. స్కూల్ టాపర్‌గా గుంటుకుల ప్రియాంక (93.6 శాతం), ద్వితీయ స్థానంలో దూస శ్రీలత (84.6 శాతం), తృతీయ స్థానంలో మడుత సాగర్ (84.4 శాతం) నిలిచారు. ఈ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు గాజెంగి కృష్ణ మాట్లాడుతూ.. ఇక్కడ స్థిరపడిన మధ్య తరగతి తెలుగు ప్రజల కోసం ఈ సంస్థను ప్రారంభించామని అన్నాడు. మున్ముందు జూనియర్ కళాశాల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని సూచించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్యకై తమ వంతు సహకారాలు అందిస్తానని శిక్షణ్ మండలి సభాపతి రాజు గాజెంగి హామీ ఇచ్చారు. కార్యక్రమానికి సంస్థ ఉపాధ్యక్షుడు నోముల శేఖర్, కార్యదర్శి లత మంగళారపు, అవదూత బలరామ్, గాలిపెల్లి మారుతి, మంగళారపు భాస్కర్‌తో పాటు ప్రధానోపాధ్యాయులు గాజుల ఉమారాణి, అర్దాకర్ అశ్విని, పూజారి జయశ్రీ తదితరులు హాజరయ్యారు.