టీడీపీ నీచ రాజకీయాలు మానుకోవాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి
అనంతపురం న్యూసిటీ: ‘ సీఎం చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యంగ విలువలను కాలరాశారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నీచ రాజకీయాలు మానుకోవాలని’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం బరితెగింపును రాష్ట్రపతికి ఫిర్యాదు చేయకూడదా అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు చంద్రబాబు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లింది వాస్తవం కాదా అన్నారు. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్లో రూ. కోట్లు వెచ్చించి ఏవిధంగా అధునాతన భవనం కట్టారో ప్రజలకు చెప్పాలన్నారు. విఠలాచార్య సినిమా తరహాలో భవనాన్ని నిర్మించారని ఎద్దేవ చేశారు. వారి పార్టీ నేతలకు కూడా తెలియకుండా గోప్యంగా నూతన భవనాన్ని ఎందుకు ప్రారంభించారో చెప్పాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారని టీడీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనీ సీఎం, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలన్నారు.