రాజకీయాల్లోకి సాఫ్ట్వేర్ ఇంజినీర్
నారాయణఖేడ్: సిండికేట్ రాజకీయాలను మార్చేస్తానంటూ ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఇతను నెలకు దాదాపు రూ.85 వేల వేతనాన్ని సైతం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మురళి గోవిందు(33) సోమవారం నారాయణఖేడ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ తాజాగా జరిగే ఉప ఎన్నిక లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుపొందుతానన్న ధీమా వ్యక్తం చేశారు.
తాను సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించక ముందు గ్రూప్స్‌కు సన్నద్ధమైనట్టు చెప్పారు. ఆ సందర్భంలో సామాజిక అభివృద్ధికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకున్నానని, భారత రాజ్యాంగం, పరిపాల న విధానంపై ఉన్న పట్టుతో తాను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయన్నారు. తనకు ఉన్న విషయ పరిజ్ఞానాన్ని రంగరించి నియోజకవర్గ అభివృద్ధి పరిచి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల సరసన ఖేడ్‌ను చేర్చడమే ధ్యేయమని తెలిపారు.
మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన తనకు మధ్యతరగతి, పేద కుటుంబాల సమస్యలు తెలుసన్నా రు. వీరి పక్షాన నిలబడి వీరందరినీ సామాజికంగా, ఆర్థికంగా బలోపే తం చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను ఈ ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వారి ఇంటిముందు ముగ్గులా కాపలా కాస్తూ అభివృద్ధికి తోడ్పడతానిని తెలిపారు.