అణువణువూ ఆరోప్రాణమై!
గ్రేట్ లవ్ స్టోరీస్
చైనాలోని షాన్‌డోంగ్ ప్రావిన్స్‌లో ఉన్న చిన్న గ్రామం సుంజియాయు మొత్తం పెళ్లి కళతో సందడిగా ఉంది. అలా అని అక్కడ సామూహిక వివాహాలేమీ జరగడం లేదు. బొగ్గుగనిలో పనిచేసే ‘డూ యున్ఫా’ పెళ్లి మాత్రమే జరుగుతోంది. సాధారణంగా ఒక ఇంట్లో పెళ్లి జరిగితే... ఆ ఇంట్లో మాత్రమే చుట్టాలు పక్కాల సందడి ఉంటుంది. కానీ యున్ఫా పెళ్లికి ఊరు ఊరంతా సందడి నెలకొంది. ఊరి వాళ్లంతా చుట్టాలయ్యారు. ఎందుకంటే అతడు అందరివాడు. మనసున్నవాడు.
కొందరు యున్ఫాను సరదాగా ఆట పట్టిస్తున్నారు. కొందరు మాత్రం అతడి గురించి జాలిగా మాట్లాడు కుంటున్నారు. ‘మన యున్ఫా ఉత్త అమాయకుడిలా ఉన్నాడు. సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద తప్ప!’
‘ఏం అలా అంటున్నావు?’
‘లేకపోతే ఏంటి? వీడి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. వీడికంటే ఒక మెట్టు పైనున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిశ్చింతంగా ఉండొచ్చు కదా!’ ‘అవుననుకో. అందరూ మనలాగే ఆలోచించరు కదా. ఆ అమ్మాయి వాడికి బాగా నచ్చుంటుంది.’ చాలామంది ఇలాగే చర్చిస్తున్నారు. కానీ యున్ఫా అవేమీ పట్టించుకోవడం లేదు. ‘‘అందరూ మాటలతో ప్రేమలో పడతారు.
నేను మాత్రం ఆ అమ్మాయి మూగకళ్లను చూసి ప్రేమలో పడిపోయాను’’ అంటూ యూయైని చూసిన తొలి క్షణాల గురించి స్నేహి తులతో చెప్తున్నాడు. పెళ్లికూతురిని చూస్తూ జానపద పాటలు కూడా పాడాడు. ఊరు ఊరంతా ‘ఇది మా ఇంటి పెళ్లి’ అనుకోవడంతో పెళ్లి ఘనంగా జరిగింది.
అయిదు నెలల తరువాత...
పై అధికారి నుంచి పిలుపు రావడంతో యున్ఫా ఉన్నపళంగా ఆయన క్యాబిన్లోకి వెళ్లాడు. ‘‘మీ ఆవిడకు ఆరోగ్యం బాలేదని ఇంటి నుంచి వార్త వచ్చింది’’... చెప్పాడు అధికారి. యున్ఫాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. మెరుపువేగంతో బయలుదేరాడు. కన్ను మూసి తెరిచేలోగా ఇంట్లో వాలిపోయాడు. ఏమైందో ఏమిటో... అవయవాలన్నీ చచ్చుబడి లేవలేని స్థితిలో ఉంది యూయై. మాట కూడా రావడం లేదు.
దీనంగా భర్త వైపు చూసింది. యున్ఫా ఆమెను తీసుకుని ఆస్పత్రికి పరుగెత్తాడు. అలా ఎన్నో నెలల వరకు ఆమెను ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూనే ఉన్నాడు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నారు డాక్టర్లు. పైగా కాలేయం, కిడ్నీలు కూడా బాగా పాడైపోయాయని చెప్పారు. యున్ఫాకి పిచ్చి పట్టినట్టయ్యింది. ఆమెకేమైనా అయితే తాను బతకలేడు. ఎలాగైనా తనను బతికించుకోవాలి. అందుకే వైద్యం కోసం ఉన్న పొలం అమ్మాడు. అప్పులు చేశాడు.
ఫలానా మొక్కతో వ్యాధి నయం అవుతుందని ఎవరో చెబితే దాని కోసం అడవుల వెంట తిరిగాడు. పాము కాట్లకు గురై ప్రాణాల మీదికి కూడా తెచ్చు కున్నాడు. కానీ ఎన్ని కష్టాలు పడినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద యున్ఫాతో అన్నాడు... ‘‘పెళ్లై ఆరునెలలు కూడా అవ్వలేదు. అంతలోనే ఇలా అయింది. నువ్వు మరో పెళ్లి చేసుకోవడం మంచిది. లేకుంటే ఈ అమ్మాయి సేవలోనే నీ జీవితం వ్యర్థమైపోతుంది.’’
మిగిలినవాళ్లు కూడా ఆయనకు వంత పాడారు. ‘‘యూయైని ఆమె తల్లి దండ్రులకు అప్పగించు. వైద్యానికి నెలకు కొంత సొమ్ము ఇవ్వు. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో. లేకపోతే నీ జీవితం నరకప్రాయ మవుతుంది’ అని చెప్పారు. నిజానికి యున్ఫాకి ఆ ఊరి వాళ్ల మాట వేదం. అందులోనూ పెద్దలు ఒక మాట చెబితే కాదనడు. కానీ ఆ రోజు మాత్రం వారి మాట వినలేదతను. ‘నేనలా చేయలేను’ అన్నట్లుగా చూశాడు.
దీనంగా తనవైపే చూస్తోన్న యూయై కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ... ‘‘కంగారు పడకు. నేను నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను’’ అన్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రమాణం చేశాడు. మరుసటి రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు యున్ఫా. ఓ తల్లిలాగా అక్కున చేర్చుకుని యూైయెుకి సేవలు చేయడం మొదలు పెట్టాడు. అలా ఆరు దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఇప్పటికీ కరుణించలేదు.
యూయెు పరిస్థితి ఏం మారలేదు. అలానే ఉంది. కానీ ఊరివాళ్లు మాత్రం చాలా మారారు. ఆ దంపతులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. వారికి తమవంతు సహాయం అందిస్తున్నారు. నిజమైన ప్రేమకు నిర్వచనంలా నిలిచిన ఆ ఇద్దరికీ చివరి వరకూ అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు.
- యాకూబ్ పాషా