![భార్య, అత్తలపై దాడి](/styles/webp/s3/article_images/13052024-satya_tab-02_subgroupimage_1305068896_mr_0.jpg.webp?itok=3KP18rkd)
భార్య, అత్తలపై దాడి
హిందూపురం అర్బన్: వ్యసనాలకు బానిసైన భర్త తన భార్య, ఆమె తల్లి, పినతల్లిపై కొడవలితో దాడి చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. వివరాలు... హిందూపురంలోని టీచర్స్ కాలనీకి చెందిన నవీన్... కిరికెర గ్రామానికి మీనాను నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే వ్యసనాలకు బానిసైన భర్తను భరించలేక భర్తను వదిలేసి పుట్టింటికి మీన చేరుకుంది. ఈ క్రమంలో కొంత కాలంగా నవీన్ తన భార్యకు అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వచ్చాడు. దీంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో తన తల్లి నందిని, పినతల్లి రాజమ్మతో కలసి టీచర్స్ కాలనీకి వచ్చిన మీన... భర్తను. నిలదీసింది. ఆ సమయంలో సమాధానం చెప్పుకోలేని నవీన్ కొడవలితో భార్య, అత్తపై దాడి చేశాడు. బంధువులు జోక్యం చేసుకుని విడిపించి, క్షతగాత్రులను వెంటనే హిందూపురంలోని జిల్లా సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వీరితో నందిని, రాజమ్మ పరిస్థితి విషమంగా ఉండడడంతో బెంగళూరుకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు హిందూపురం రెండో పట్టణ పోలీసులు తెలిపారు.
యువకుడి కిడ్నాప్... దాడి
మడకశిర రూరల్: మండలంలోని ఆర్.అనంతపురం గ్రామంలో పాతకక్షల కారణంగా హరీష్ అనే యువకుడిని కొందరు వ్యక్తులు ఆదివారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. బంధువు ఆంజనేయులు తెలిపిన మేరకు...బెంగళూరులో ఉంటున్న హరీష్ ఓటు వేసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం మదర్స్‌డే సందర్భంగా స్నేహితుడితో కలసి ద్విచక్ర వాహనంపై తొమ్మతిమర్రికెళ్లి కేక్ కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. వెంబడించిన కొందరు వ్యక్తులు మార్గమధ్యంలో అడ్డుకుని హరీష్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్న స్నేహితుడి సమాచారం మేరకు కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులు కర్ణాటక ప్రాంతం పాడగడ తాలూకా కన్నెమేడి వద్ద వంకలో గాయాలతో పడి ఉన్న హరీష్‌ను గుర్తించి మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తనను వంకలోకి తీసుకువెళ్లి కర్రలతో చితకబాదినట్లుగా బాధితుడు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
‘అనంత’ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం మార్పు
అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో నాల్గో ప్లాట్‌ఫాంను ఆదివారం నుంచి రద్దు చేసినట్లు స్టేషన్ మేనేజర్ అశోక్‌కుమార్ తెలిపారు. ధర్మవరం, కదిరి, తిరుపతి, హిందూపురం, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లన్నీ ఇకపై మూడో ప్లాట్‌ఫాంపైకి వస్తాయన్నారు. అమృత్ పథకంలో భాగంగా అనంతపురం రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే శాఖ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాల్గో ప్లాట్‌ఫాంను పూర్తిగా తొలగించడంతో మార్పు చేయాల్సి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment