ఆదిలాబాద్: అతివేగం.. ఆపై నిర్లక్ష్యం... అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి నిండుప్రాణం తీసుకున్నాడు డీసీఎం డైవర్. రూరల్ ఎస్సై చంద్రమోహన్, స్థానికుల కథనం ప్రకారం.... మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన డీసీఎం వాహనం నిర్మల్ రూరల్ మండలం చిట్యాల బ్రిడ్జి పైన సిమెంట్ లోడుతో భైంసా వైపు వెళ్తున్న లారీని ఎదురుగా ఢీకొట్టింది. అనంతరం కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది.
ఈ సమయంలో వ్యాన్ డ్రైవర్ మోహిత్‌పాల్ (44) రెండో లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మొదటి లారీ డ్రైవర్ షేక్ అజీజ్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. స్థానికులు, పోలీసులు శ్రమించి బయటకు తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డీసీఎం డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు పేర్కొన్నారు.
మోహిత్‌పాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కందువ జిల్లా అట్టర్ గ్రామస్తుడిగా గుర్తించారు. బ్రిడ్జిపై మూడు వాహనాలు నిలిచిపోవడంతో రెండువైపులా ట్రాఫిక్ స్తంభించింది. భైంసా, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్ మీదుగా తరలించారు. రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అతికష్టం మీద ఢీకొన్న వాహనాలను పక్కకు తొలగించి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
లారీ రూపంలో.. మరో ముగ్గురు..
లారీ రూపంలో వచ్చిన మృత్యువు ముగ్గురి ప్రాణాలు కబలించింది. దీంతో ఆ గిరిజన నిరుపేద కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివరాలలోకి వెళ్తే... మండలంలోని పులిమడుగు గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేరడిగొండ మండలంలోని చించోలి గ్రామానికి చెందిన కుమ్రం రాజేంద్రప్రసాద్(31), బందంరేగడి గ్రామానికి చెందిన లాల్‌సింగ్(45), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలోని బుద్ద రామసముద్రంనకు చెందిన లారీ క్లీనర్ షేక్ ఖాసీం పేర(43) మృతిచెందారు.
ఎలా జరిగింది..?
కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పులిమడుగు సమీపంలోని జాతీయ రహదారిపై టిప్పర్ ద్వారా మట్టితో రోడ్డు పక్కన గుంతలకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో టిప్పర్ బోల్తా పడింది. టిప్పర్‌ను నడుపుతున్న లాల్‌సింగ్‌తో పాటు టిప్పర్‌లోని కుమ్రం రాజేంద్రప్రసాద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు.
కుమ్రం రాజేంద్రప్రసాద్ తండ్రి కుమ్రం జంగు నేరడిగొండ మండలంలోని లకంపూర్(జి) గ్రామ సర్పంచ్. రాజేంద్రప్రసాద్ జాతీయ రహదారి నిర్వహణ కంపెనీలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బందంరేగడి గ్రామానికి చెందిన లాల్‌సింగ్ కొన్ని రోజులుగా ఈ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
మూలమలుపు.. అతివేగం..
ప్రమాదం జరిగిన స్థలం వద్ద మూలమలుపు ఉంది. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఈ గుట్ట ప్రాంతంలో 40కిలో మీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉన్నప్పటికీ మూలమలుపుతో పాటు రోడ్డు పల్లంగా ఉండటంతో వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడిన లారీ క్లీనర్‌ను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment