Telangana News: నచ్చితే తీస్కో..! లేదంటే మూస్కో..!! గొర్రెల పంపిణీలో ‘గోల్‌మాల్‌’..
Sakshi News home page

నచ్చితే తీస్కో..! లేదంటే మూస్కో..!! గొర్రెల పంపిణీలో ‘గోల్‌మాల్‌’..

Published Mon, Sep 11 2023 1:38 AM | Last Updated on Mon, Sep 11 2023 10:49 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: గొల్ల, కుర్మలు, యాదవుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు అందించడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క యూనిట్‌ ధర రూ.1.75లక్షలు ధర నిర్ణయించిన ప్రభుత్వం తన వాట కింద రూ.1,31,250 చెల్లించగా, లబ్ధిదారుడు రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది.

ఇందులో 20 గొర్రెలు, ఒక పొటెలు కొనుగోలుకు రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ. 25వేలతో గొర్రెల తరలింపు మందులు కొనుగోలు, ఇన్సురెన్స్‌ కోసం నిధులు కేటాయించడం జరిగింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రభుత్వం రెండో విడత పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3597 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారు. ఒక్కొక్క లబ్ధిదారుడు రూ.43,750 చొప్పున మొత్తం రూ.15.73 కోట్ల డీడీలు చెల్లించారు. దాదాపు సంవత్సర కాలంగా ఎదురుచూడగా ఈ ఏడాది జూలైలో యూనిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.

ఇవీ విధివిధానాలు...
మొదటి విడత గొర్రెల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం పంపిణీ విధివిధానాలను మరింత కఠినతరం చేసింది. గొర్రెల ఎంపికలో మండల పశువైద్యాధికారుల పాత్రను తగ్గించి జిల్లా , రాష్ట్ర స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీనికోసం జిల్లా పశువైద్యాధికారి పర్యవేక్షణలో జిల్లా అధికారి, రాష్ట్ర స్థాయి అధికారితో కూడిన టీంను సిద్ధం చేశారు. లబ్ధిదారులు అధికారులతో కలిసి స్వయంగా గొర్రెల విక్రయించే వారి వద్దకు వెళ్లి కొనుగోలు చేసేలా, కొనుగోలు సమయంలో ప్రత్యేకమైన ట్యాబ్‌ల్లో ఆన్‌లైన్‌లో తమ ఇష్టపూర్వకంగా గొర్రెలను ఎంపిక చేసుకున్నట్లు వాయిస్‌ మెసెజ్‌ అప్‌లోడ్‌ చేసేలా నిబంధనలు చేర్చారు.

447 యూనిట్ల పంపిణీ...
ఈ ఏడాది జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌ మాసాల్లో జిల్లా వ్యాప్తంగా రూ.7.80 కోట్లతో మొత్తం 447 యూనిట్లు (9387 గొర్లు) పంపిణీ చేశారు. మొత్తం 3597 మంది డీడీ కట్టగా, ఇప్పటి వరకు కేవలం 447 మందికే గొర్లు పంపిణీ చేశారు. ఇంకా 3150మందికి గొర్లు రావాల్సి ఉంది. వీరంత సంవత్సర కాలంగా ఒక్కొక్కరు రూ. 43,750 చొప్పున డీడీలు చెల్లించారు. ఎన్నికల కోడ్‌ వస్తుందని సర్వత్రా చర్చలు నడుస్తుండటంతో తాము కట్టిన డబ్బులు అయిన తిరిగి వస్తే చాలు అన్న పంథాలో లబ్ధిదారులు ఉన్నారు. దీంతో కొంత మంది అధికారులు, నాయకులు వీరి నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్నారు.

నచ్చితే తీస్కో.. లేదంటే మూస్కో..
గొర్రెల పంపిణీలో అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం కఠినమైన విధివిధానాలను రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆగడం లేదు. పక్క రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కోదాడ మండలం నుంచి మాత్రమే గొర్రెలు కొనుగోలు చేస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. కోదాడ మండలంలోని నాలుగు గ్రామాల్లో గొర్రెల లభ్యత ఉండగా లబ్ధిదారులను అక్కడికే పంపించి గొర్రెలను తీసుకునేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అప్పటికే అనారోగ్యంతో ఉన్నవి, చెవికి ట్యాగ్‌ గాయాలతో ఉన్న (పలుమార్లు ఏమార్చి ఇన్ష్యూరెన్స్‌ చేయబడినవి) గొర్లను కట్టబెడుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

మా దృష్టికి రాలేదు..
జిల్లాలో గొర్రెల పంపిణీలో ఎలాంటి అక్రమాలు మా దృష్టికి రాలేదు. నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు స్వయంగా వెళ్లి గొర్రెలు తెచ్చుకుంటున్నారు. గొర్రెల రవాణా కోసం వినియోగించే వాహనాలకు సైతం జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చడం జరిగింది. లబ్ధిదారుల గ్రామాలకు గొర్రెలు చేరిన తరువాత కూడా ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం జరుగుతుంది. ఎక్కడైన అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. –కిషన్‌, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి

కట్టింది రూ.43వేలు.. ఇచ్చేది రూ.90వేలే...
లబ్ధిదారులు గొర్రెలను ఎంపిక చేసుకున్న తరువాత అధికారులు జీపీఎస్‌ ట్యాగ్‌ ఉన్న ఐచర్‌ వాహనాల్లో, ఒక్కొక్క వాహనంలో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను లబ్ధిదారుల గ్రామాలకు తరలిస్తున్నారు. అక్కడ సర్పంచ్‌, గొల్లకుర్మ కమిటీ అధ్యక్షుడు, లబ్ధిదారుడు, స్థానిక పశువైద్యాధికారి సమక్షంలో ఐచర్‌ ఫొటోలు, గొర్రెల ఫొటోలు తీసీ ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. అనంతరం రెండు, మూడు రోజుల్లో గొర్రెలు అమ్మిన వ్యక్తి బ్యాంక్‌ ఖాతాల్లో ప్రభుత్వం ఒక్కొక్క యూనిట్‌కు రూ.1.50లక్షలు జమ చేయడం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కథ ఇక్కడే ప్రారంభం అవుతుంది.

ముందుగానే కుదుర్చుకున్న డీల్‌ ప్రకారం తన ఖాతాల్లో డబ్బులు పడగానే సదరు గొర్రెలు అమ్మిన వ్యక్తి ఒక లారీతో ఆయా గ్రామాలకు వచ్చి లబ్ధిదారులకు యూనిట్‌కు రూ.90వేలు చెల్లించి తాను ఇచ్చిన గొర్రెలను మరల లారీలో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. లబ్ధిదారులే అమ్ముకుంటున్నారని వారిని బద్నాం చేసే పనులు అధికారులు చేస్తున్నప్పటికీ అధికారులు, నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని లబ్ధిదారుల వాదన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement