No Headline
జిల్లాలో కొలిక్కిరాని ఏఎంసీ పాలకవర్గాలు ‘ఆదిలాబాద్’ చైర్మన్ విషయంలో వీడని సందిగ్ధం తెరపైకి పేర్లు వస్తున్నా.. ఖరారులో జాప్యం
సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొదటి మార్కెట్ కమిటీ పాలకవర్గం జిల్లాలోని బోథ్‌కు నియమించారు. దీంతో జిల్లాలో ఖాళీగా ఉన్న మిగతా ఏఎంసీలకు కూడా త్వరితగతిన పాలకవర్గాలను నియమిస్తారని అందరూ భావించారు. అయితే రాష్ట్రంలో దాదాపు అన్ని మార్కెట్ కమిటీల ఏర్పాటు పూర్తయ్యే దశకు చేరినా.. జిల్లాలో మాత్రం ఆదిలాబాద్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పాలకవర్గాల ఏర్పాటు ఇంకా పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఆదాయం ఇచ్చే ఆదిలాబాద్ ఏఎంసీకి పాలకవర్గ నియామకంలో ఊగిసలాట కొనసాగుతుంది. ఇప్పుడు అప్పుడు అంటూ వస్తున్నప్పటికీ ఆ తర్వాత ఎందుకో నిలిచిపోతుంది. తాజాగా జైనథ్‌కు చెందిన మునిగెల విఠల్ పేరు దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నప్పటికీ అధికారికంగా వెల్లడి కావడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నుంచి దీనికి సంబంధించి జాబితా కూడా జిల్లాకు పంపించినప్పటికీ ఇంకా దానికి ఆమోద ముద్ర పడటం లేదు. దీంతో మళ్లీ చైర్మన్ పదవికి పేరు మార్పు ఏమైనా ఉంటుందా అనే సందిగ్ధం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. మొదట్లో కోరెడ్డి కిషన్ పేరు దాదాపుగా ఖరారనే ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత నిలిచిపోయింది. తాజాగా మునిగెల పేరు వినిపిస్తున్నప్పటికీ కొంత మంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతోనే ఈ పరిస్థితి ఉంది.
ఆ రెండు పాలకవర్గాలు కూడా..
ఇచ్చోడ, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీలకు కూడా పాలకవర్గాల నియామకంలోనూ జాప్యం అవుతోంది. ఇక్కడ కూడా పలువురి పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత వాటి ఊసే లేకుండా పోయింది. ఎస్టీ రిజర్వుడ్ అయిన ఈ రెండు ఏఎంసీలకు ఎవరిని చైర్మన్‌గా నియమిస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఇంద్రవెల్లి ఏఎంసీ ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పరంగా ఏకై క ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ సూచించిన వారికే పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇచ్చోడకు కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ సూచించిన వ్యక్తికే పదవి ఇచ్చే అవకాశం ఉంది. కాగా పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదికి సమీపిస్తున్నా నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ పరంగా జరుగుతున్న ఈ జాప్యంపై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. చైర్మన్‌తో పాటు పాలకవర్గంలోని సభ్యుల పదవుల విషయంలోనూ పలువురు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు ఈ విషయంలో చొరవ చూపి అసలైన కార్యకర్తలకు పదవులు దక్కేలా చూడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment