టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టెన్షన్‌

Published Sun, Oct 6 2024 2:48 AM | Last Updated on Sun, Oct 6 2024 2:48 AM

టెన్ష

టెన్షన్‌

ఏవోబీలో
● ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌తో ఉద్రిక్త వాతావరణం ● అప్రమత్తమైన పోలీసులు ● చుట్టుముట్టిన బలగాలు ● అణువణువు ముమ్మర గాలింపు
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
గిరి యువత శాంతి ర్యాలీ

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారీస్థాయిలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో ఏవోబీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన

నుంచి తప్పించుకున్న మావోయిస్టులు సరిహద్దు ప్రాంతానికి వచ్చి తలదాచుకునే అవకాశం ఉన్నందున ఆంధ్రా– ఒడిశా పోలీసు బలగాలు అప్రతమత్త మయ్యాయి. అణువణువు జల్లెడ

పట్టడంతో గిరిజన గ్రామాలు భయం గుప్పెట్లో ఉన్నాయి.

సాక్షి, పాడేరు: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల నేపథ్యంలో ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణపూర్‌–దంతేవాడ జిల్లాల సరిహద్దులోని దక్షిణ అబుజ్‌మడ్‌ ప్రాంతం నేడూరు–తులతులి అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి వరకు జరిగిన ఈ భీకర పోరులో భారీ సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలతో పాటు ఆంధ్రా, ఒడిశాకు చెందిన మావోయిస్టు సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంఽధ్రా, ఒడిశా రాష్ట్రాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్‌కౌంటర్‌ సమాచారం తెలుసుకున్న పోలీసు బలగాలు వెంటనే ఏవోబీలో మోహరించాయి. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టులు ఆంధ్ర ఒడిశా సరిహద్దు కటాఫ్‌ సేఫ్‌ జోన్‌లోకి వచ్చి తలదాచుకునే అవకాశాలు ఉన్నందున కూంబింగ్‌ ముమ్మరం చేశాయి. అణువణువు జల్లెడ పడుతున్నాయి.

వరుస ఎన్‌కౌంటర్లతో తీవ్ర నష్టం

దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లు నక్సల్బరీ ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్‌ అడవులు సురక్షిత ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా పోలీసులు పట్టు సాధించారు. అందువల్లనే భారీ సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తాజా ఘటనతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

● ఈ రెండేళ్లలో ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతాలతో పాటు అబుజ్‌మడ్‌ దండకారణ్యంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్‌ కౌటర్లలో సుమారు 180 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

మరో రామ్‌గుడ..

ఆంధ్రా సరిహద్దు ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా బడిమెల బ్యాక్‌ వాటర్‌ ప్రాంతం రామ్‌గుడలో 2016లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల శిబిరంపై పోలీసులు కాల్పులు జరపడం అప్పటిలో సంచలనమైంది. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. సురక్షిత ప్రాంతంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ అడవులకు మకాం మార్చినా వారికి అక్కడ కూడా ఎదురు దెబ్బలు తప్పలేదు.

● దండకారణ్యంలో ఎప్పటికప్పుడు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయితే రామ్‌గుడ తరువాత అదే తరహాలో ఎనిమిదేళ్ల తరువాత ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బగానే చెప్పవచ్చు. ఈ ఘటనను మరో రామ్‌గుడగా పోలీసు బలగాలు చెబుతున్నాయి.

● దండకారణ్యంలో మావోయిస్టు కార్యకలపాల నిరోధమే లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఏవోబీలో మావోయిస్టుల సంచారం తగ్గినప్పటికీ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వారి ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఈ ప్రాంతంపై పోలీసు బలగాలు ప్రత్యేక దృష్టి సారించడంతోఎదురు కాల్పుల ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

భయం గుప్పెట్లో గ్రామాలు

ఆంధ్రా ఒడిశా–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతం చాలా రోజుల తరువాత తుపాకుల మోతతో దద్దరిల్లింది. దీంతో నిన్నటివరకు ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెంచాయి. దీంతోపాటు అనుమానిత ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేయడంతో ఎప్పుడు ఏ జరుగుందోనన్న ఆందోళన నెలకొంది.

అగ్ర నేతలే లక్ష్యం..

సీలేరు: మావోయిస్టులు ఉనికి కోల్పోతున్న తరుణంలో పూర్తి అణచివేతే లక్ష్యంగా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు బలగాలు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే కుమారుడు మున్నా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటినుంచి మావోయిస్టు ఉద్యమంలో చేరికలు తగ్గాయి. ఇదే తరుణంలో ప్రభుత్వాలు కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని మారుమూల గ్రామాల గిరిజనులకు చేరువ చేశాయి. దీంతో గిరిజనుల్లో కూడా మార్పు వచ్చింది. పాడేరు జిల్లా కేంద్రంగా కమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం కూడా మావో యిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. వారికి గ్రామాల్లో సహకారం అందించే మిలీషియా సభ్యులు లొంగిపోవడంతో మరింత పట్టు కోల్పోయింది. దీంతో పోలీసులు స్పీడ్‌ పెంచారు. మావోయిస్టుల అగ్రనేతలే లక్ష్యంగా ముందుకు సాగుతూ పట్టు సాధిస్తున్నారు. దీనిలో భాగంగానే అబుజ్‌మడ్‌ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మావోయిస్టులు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

మోతుగూడెం: బొడ్డగండి పంచాయతీ డొంకరాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మంగంపాడు వారపు సంతలో శనివారం మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 20 వరకు నిర్వహించే మాసోత్సవాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీ యువజన సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం యువకులు శాంతి ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
టెన్షన్‌1
1/3

టెన్షన్‌

టెన్షన్‌2
2/3

టెన్షన్‌

టెన్షన్‌3
3/3

టెన్షన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement