పొలంలో మట్టి నమూనా సేకరణ
నేలను నమ్ముకుని బతికే రైతుకు నేల స్వభావం, భూసారం తెలుసుకోవడం కీలకం. గతంలో ఆ సౌకర్యాల్లేవు. సీఎం జగన్ నేతృత్వంలోని రైతు ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే భూసార పరీక్షలకు నమూనాలు సేకరిస్తున్నారు. అసంబద్ధ రసాయన ఎరువుల ద్వారా క్షీణించిన భూసారాన్ని ముందుగానే అంచనా వేసి, అందుకు అనుగుణంగా చర్యలకు ఆర్బీకే సిబ్బంది సాయపడుతున్నారు. భూసార పరీక్షలతో అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నారు.
సాక్షి, అనకాపల్లి: సాగు భూమిలో సారం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. పంటలో వాడే రసాయనాలు, ఎరువులతో భూమిలో చాలా మార్పులు జరుగుతాయి. వాటిని ముందుగానే గుర్తించి, సారం పెంచే చర్యలతోపాటు, ఏ పంటకు అనుకూలమో.. నిర్ణయించేందుకు భూసార పరీక్షలు కీలకం. భూసార పరీక్షకు అవసరమైన మట్టినమూనా సేకరణకు ఆలస్యం చేయవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతోపాటు జిల్లాలో కనీసం 10 వేల భూసార పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో వ్యవసాయ సిబ్బంది సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా జిల్లాలో 4,380 మట్టి నమూనాలను సేకరించారు. వాటిని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో గల సాయిల్ టెస్ట్ ల్యాబ్‌కు చేర్చారు.
నమూనా తీసే విధానం
నమూనా తీసేచోట నేలపై ఆకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేలపై నాగలి చోలు లోతున మట్టిని తీసుకోవాలి. నేలపై ఆంగ్ల అక్షరం ‘వి’ఆకారంలో 6–9 అంగుళాల లోతున గుంత తవ్వి, పై నుంచి కింది వరకు మట్టిని తీసుకోవాలి. ఇలా 10 నుంచి 12 చోట్ల మట్టిని సేకరించి గోనైపె వేసి కలిపాలి. దాన్ని నాలుగు సమ భాగాలుగా చేసి అందులో ఒకటి, నాలుగు భాగాలలో సుమారు అర కిలో మట్టిని సేకరించాలి. నమూనా సేకరించేప్పుడు మట్టి రంగు, నేల రకం, మెరక పల్లాలను అనుసరించి నమూనాలు తీసుకోవాలి. ఐదు ఎకరాలకు ఒక నమూనా చొప్పున సేకరిస్తారు. చేను దున్నిన తరువాత, ఎరువు వేయక ముందు మట్టిని సేకరించాలి. అదే మాగాణి భూముల్లో అయితే నీరు పెట్టక ముందే నమూనా తీయాలి.
సూక్ష్మ పోషకాల లభ్యత
ఖరీఫ్ సమయంలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల ఆధారంగా భూ యాజమాన్య చర్యలు తీసుకోవాలి. దీంతో ఎరువులు సమర్ధంగా, పొదుపుగా వినియోగించి భూసారాన్ని కాపాడుకోవచ్చు. రైతుల పొలాల్లో సేకరించిన మట్టి నమూనాలకు 13 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. మట్టి పీహెచ్(ఉదజని సూచిక), లవణ సూచిక (ఈసీ), సేంద్రియ కర్బనం(ఓసీ), స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్, బొరాన్, సల్ఫర్ పరీక్షలు చేస్తారు. ఇవన్నీ సమతుల్యతలో ఉంటేనే అధిక దిగుబడులు వస్తాయి. భూమిలో చౌడు, సున్నం గుణాలు, విష పదార్థాల కలయికను గుర్తించి చర్యలు తీసుకోవచ్చు.
ల్యాబ్ సూచనలు పాటించాలి
భూసార ఫలితాల్లో మట్టికి ఉదజని సూచిక 6.5–7.5 మధ్య ఉండి, అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటే వాటిని తటస్త భూములుగా పరిగణించి విరుగుడుగా సున్నం వేస్తే సరిపోతుంది. పీహెచ్ 8 కంటే ఎక్కువగా ఉంటే క్షార భూములుగా పరిగణించి, జిప్సం వంటి పోషకాల్ని వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. 6.5 కంటే తక్కువ ఉంటే అమ్ల ఎరువులు వేసుకోవాలి. నేలలో భాస్వరం స్థాయి కూడా కీలకం. భాస్వరం ఎక్కువ ఉంటే మొక్కకు జింక్, ఇనుము అందకుండా చేస్తాయి. పంట పండక ముందే ఎరగ్రా కనిపిస్తుంది. మట్టి నమూనా ఫలితాలాధారంగా వ్యవసాయ శాస్త్రవేత్తలిచ్చే సూచనల మేరకు ఎరువులు ఉపయోగించాలి.
ఆర్బీకేల వారీగా భూసార పరీక్షలు
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల చెంతనే అన్ని సేవలు అందుతున్నాయి. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా శాఖాపరంగా ప్రతి గ్రామంలో అవగాహన కార్య క్రమాలు నిర్వహించాం. భూసార పరీక్షలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు తీసి భూసార పరీక్షలు చేయించుకోవాలి. ప్రయోగశాల నుంచి ఫలితాలను బట్టి నేలకు అవసరమైన స్థూల పోషకాలను అందిస్తే నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంది.
– బి. మోహనరావు,
జిల్లా వ్యవసాయాధికారి
మట్టి నమూనాలకు 13 రకాల పరీక్షలు
అధిక దిగుబడి, ఎరువులు, పెట్టుబడి ఆదా
జిల్లాలో 10 వేల భూసార పరీక్షలు లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment