తుస్సుమన్న ‘పంచాయతీ’
● పక్కదారిపట్టిన ఈవోపీఆర్డీ బదిలీల విచారణ ● అనకాపల్లి, అల్లూరి జిల్లాల బదిలీలపై ఆరోపణలు ● విశాఖ జిల్లాకే విచారణ పరిమితం ● నివేదికను కలెక్టర్ హరేందిరప్రసాద్‌కు సమర్పించిన జెడ్పీ సీఈవో
మహారాణిపేట (విశాఖ): మోకాలికి దెబ్బతగిలితే బోడి గుండుకు కట్టు వేసినట్లు ఉంది పంచాయతీరాజ్ శాఖ అధికారుల తీరు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో జరిగిన బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తే.. వాటిని మినహాయించి విశా ఖ జిల్లాలో బదిలీలపై మాత్రమే విచారణ చేయించడం విడ్డూరంగా ఉంది. అసలు దొంగలకు కొమ్ముకాయడానికి కూటమి నేతల నుంచి ఉన్నతాధికారుల వరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర దుమారం రేపిన ఈవోపీఆర్డీల బదిలీల వ్యవ హారంలో విచారణ చివరకు తుస్సుమనిపించారు. ఆరోపణలు ఉన్న జిల్లాల్లో విచారణ చేయకపోవడం పట్ల పంచాయతీరాజ్ ఉద్యోగులు విస్తుపోతున్నారు. ఈ బదిలీల్లో అక్రమాలు జరిగాయని ఉద్యోగులే స్వయంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ.. విచారణను పక్కదారి పట్టించడం ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
అనకాపల్లి కేంద్రంగా అక్రమాలు
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఈవోపీఆర్డీ అధికారుల బదిలీల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కొంతమంది పంచాయతీ అధికారులు, సిబ్బంది.. నచ్చిన వారిని అందలం ఎక్కించారన్న విమర్శలు వినిపించాయి. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్టు స్వయంగా ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ అక్రమ బదిలీలు కారణంగా దీర్ఘకాలంగా అల్లూరి జిల్లాలో పనిచేస్తున్న వారు ఇప్పటికీ మైదాన ప్రాంతాలకు రాలేకపోయారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న వారు గిరిజన ప్రాంతాలకు వెళ్లకుండా తమ పలుకుబడిని ఉపయోగించి స్థానికంగానే పోస్టింగ్‌లు సంపాదించుకున్నారు. దీనిపై కొంత మంది ఉద్యోగులు కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఈ బదిలీల వ్యవహారంపై జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తితో విచారణకు ఆదేశించారు. దీని ప్రకారం సీఈవో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పోస్టింగ్‌ల వివరాలు కోరినప్పటికీ.. సంబంధిత అధికారుల నుంచి స్పందన లేకపోవడం విశేషం. విచారణ హాజరుకావాలని రెండు సార్లు అనకాపల్లి డీపీవో, అల్లూరి జిల్లా డీపీవోలకు చెప్పినా డుమ్మా కొట్టారు. బదిలీల జాబితాను సైతం విచారణాధికారికి ఇవ్వలేదన్న వాదనలు ఉన్నాయి. ఈ దశలో విచారణ నుంచి అనకాపల్లి, అల్లూరి జిల్లాలను మినహాయించారు. ఆయా జిల్లాల్లో జరిగిన బదిలీలపైనే ఆరోపణలు రాగా.. వాటిని తప్పించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం విశాఖ జిల్లాలో మాత్రమే విచారణ చేపట్టేలా ఆదేశాలిచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే జెడ్పీ సీఈవో విశాఖ జిల్లాలో విచారణ పూర్తి చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదికను సమర్పించారు.
ప్రజా ప్రతినిధుల హస్తం
జెడ్పీ సీఈవోను రెండు జిల్లాల విచారణ నుంచి తప్పించడంలో కొంత మంది ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది. సమాచార సేకరణలో వేగంగా ఉండడం, బదిలీలైన వారి వివరాలు, బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇవ్వాలని జెడ్పీ సీఈవో అడగడంతో కొంత మంది అధికారుల్లో భయం నెలకొంది. ఈ విచారణకు పంచాయతీ అధికారులు సహకరించకపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కూటమి ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి తమ వారిని కాపాడుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అందువల్లే అనకాపల్లి, అల్లూరి జిల్లాలను విచారణ నుంచి మినహాయించారు. దీంతో మొత్తం విచారణ నీరు కారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment