పీజీఆర్‌ఎస్‌కు సమస్యల వెల్లువ
● కలెక్టరేట్‌లో 242 అర్జీల నమోదు ● నిరసనలతో తమ కష్టాలను వెల్లడించిన బాధితులు
తుమ్మపాల: ప్రతి వారంలాగే కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్ధ (పీజీఆర్‌ఎస్)కు ఈ సోమవారం కూడా పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ కష్టాలను విన్నవించారు. వ్యక్తిగత ఇక్కట్లతో పాటు సామూహిక సమస్యలను తెలపడానికి బృందాలుగా వచ్చిన బాధితులు నిరసనల రూపంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 242 అర్జీలు నమోదయ్యాయి. అధిక సంఖ్యలో రెవెన్యూ సమస్యలపై 145 వినతులు అందాయి. కలెక్టర్ విజయ కృష్ణన్‌తో పాటు జేసీ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు అందజేసిన అర్జీల గురించి సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో తక్షణమే మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
మద్యం దుకాణం వద్దే వద్దు
నివాసాల మధ్య మద్యం దుకాణం వద్దంటూ 10 వేల మంది జనాభా గల గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానిస్తే.. దానిని ధిక్కరిస్తూ కూటమి పార్టీల నాయకులు, ఎక్త్సెజ్ అధికారులు వ్యవహరించడం తగదని అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పలువురు విద్యావేత్తలు, గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పట్టణానికి ఆనుకుని శారదానది ఒడ్డున అనేక దేవాలయాలు, విద్యార్ధుల నివాసాల వద్ద మద్యం దుకాణం ఏర్పాటుతో ప్రశాంత జీవనం కోల్పోతున్నామన్నారు. రాత్రి సమయాల్లో మందుబాబుల హడావుడితో మహిళలు, విద్యా ర్ధులు భయాందోళనల గురించి కలెక్టర్‌కు వివరించారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని గౌరవించి తక్షణమే మద్యం దుకాణాన్ని మరోచోటకు తరలించాలని కోరారు. గ్రామస్తులతోపాటు శారదా సంక్షేమ సంఘం సభ్యులు బి.దొరమ్మనాయుడు, తాడి చక్రవర్తి, ఎ.శాంతి, బి.చిన్నారావు, ఆర్.కుమారి పాల్గొన్నారు.
జనగణనతోపాటే కులగణన జరగాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న జనగణనతో పాటు కులగణన పూర్తిచేసి రాష్ట్రంలో స్ధానిక సంస్ధలు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొణతాల చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో నేటి వరకు ఏ ప్రభుత్వము సమగ్ర కులగణన చేపట్టలేదని, సమాజంలో అధిపత్యం చెలాయించే పెత్తందారి శక్తులు ఓబీసీలను అణిచివేయడంతో సమాజంలో అట్టడుగున నెట్టివేయబడ్డారన్నారు. ఓబీసీ వర్గాలు అనేక ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దేశంలో 52 శాతం ఉన్న ఓబీసీలకు ఎస్సీ, ఎస్టీల వలే రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అధ్యాయనాలు సమగ్ర కుల గణన జరిపించాలనే నివేదికలు సమర్పించాయన్నారు.
కష్టాలు కడతేర్చు కలెక్టరమ్మా..
ఇరవైసార్లకు పైగా ఫిర్యాదులు చేసినా నా మొర ఆలకించే నాధులే లేరు. నాది పూడిమడక పంచాయతీ కొండపాలెం గ్రామం. చేపలు అమ్ముకుని కష్టార్జితంతో కొనుగోలు చేసుకున్న పూడిమడక సర్వే నెం.126/2 లో (ఖాతా నెం.685) 36 సెంట్ల భూమిని అమ్ముకోకుండా పక్క రైతులు అడ్డుపడుతున్నారు. సర్వే చేయకుండా అడ్డుకుని అధికారులపై దుర్భాషలాడటంతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. చేసిన అప్పులు తీర్చుకోలేక, భూమిని అమ్ముకుంటే కొలతలు జరగకుండా నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. గత రెండేళ్ళుగా ఎమ్మార్వో, పోలీసులు చుట్టూ తిరుగుతున్నా ఫలితం సున్నా. జిల్లా ఏర్పడిన తరువాత రెండేళ్లలో 20కి పైగా ఫిర్యాదులు చేశా. ఒంటరిదాన్ని కావడంతో నాకు ఎవరూ సహాయం చేయడం లేదు. అధికారులు కూడా న్యాయం చేయకపోవడంతో కలెక్టరమ్మయినా న్యాయం చేస్తుందన్న నమ్మకంతో వచ్చాను.
–మేరుగు కొండమ్మ, కొండపాలెం, పూడిమడక పంచాయతీ
మార్టూరు బీటలు వారుతోంది..
అపరిమిత బ్లాస్టింగ్‌లతో మా మార్టూరు గ్రామం బీటలు వారుతోంది. సర్వే నెం.1 కొండపై రసాయనాలతో బ్లాస్టింగ్‌లు చేసి ఖనిజాన్ని దోచేస్తూ ప్రజలను కాలుష్యంలోకి నెట్టేస్తున్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి కిడ్నీ బాధితులుగా మారుతున్న ప్రజలను కాపాడాలంటూ మా గ్రామస్తులం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం. క్వారీలు, క్రషర్లలో ఉపాఽధి పేరుతో గ్రామస్తులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అనధికార క్వారీల సంఖ్య విపరీతంగా పెరిగింది. భారీ బ్లాస్టింగ్‌లతో గ్రామప్రజలు హడలెత్తిపోతున్నారు. ఖనిజాన్ని రాత్రిపగలు తేడా లేకుండా పరిమితికి మించి ఓవర్‌లోడ్‌లతో తరలించడంతో గ్రామం కాలుష్యం కొరల్లో చిక్కుకుంటోంది. ఏపీ పొల్యూషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. –కోట్ని సురేష్, మార్టూరు
Comments
Please login to add a commentAdd a comment