సర్వం శివమయం
ముద్దుర్తి శ్రీ సంగమేశ్వరస్వామి స్వామివారి కల్యాణానికి తరలివచ్చిన భక్త జనం
(ఇన్‌సెట్) వైభవంగా సంగమేశ్వరస్వామికి కల్యాణం
పంచదార్లలో ఉమాధర్మలింగేశ్వరస్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో బారులుతీరిన భక్తులు (ఇన్‌సెట్) ఉమాధర్మలింగేశ్వరునికి పూజలు చేస్తున్న అర్చకుడు
చోడవరం/రాంబిల్లి (యలమంచిలి): కార్తీక మాసం నాలుగో సోమవారం.. శివాలయాల్లో భక్తజన సందోహం.. పలు దేవాలయాల్లో కనుల పండువగా శివ పార్వతుల కల్యాణం.. ఊరూరా ఆధ్యాత్మిక వాతావరణం.. జిల్లాలోని పవిత్ర పుణ్య స్నానఘట్టాల్లో ఒకటైన ముద్దుర్తి సంగమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రతి ఏటా నాలుగో సోమవారం నాడు స్వామివారికి కల్యాణం జరుపుతారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో మూడు నదుల సంగమమైన శారదానది ఒడ్డున ఉన్న స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను ఉంచి కల్యాణాన్ని జరిపారు. స్వామివారి తిరువీధోత్సవాన్ని ముద్దుర్తి పురవీధుల్లో నిర్వహించారు. సీతానగరం, తగరంపూడి, ముద్దుర్తి, కొత్తపల్లి, భోగాపురం, గోవాడ, అంభేరుపురం, గంధవరం, వెంకన్నపాలెం నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి కల్యాణానికి పూలు, పండ్లు, పిండివంటలు సారె తెచ్చారు. చోడవరం శ్రీ స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇక్కడ ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
రాంబిల్లి మండలంలోని పంచదార్ల పుణ్యక్షేత్రంలో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉమాధర్మలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. కొండ దిగువన రాధామాధవస్వామి ఆలయం వద్ద ఉన్న పుణ్యధారల్లో పవిత్ర కార్తీక స్నానాలు ఆచరించి కొండ మీద ఉన్న ఉమాధర్మలింగేశ్వరుని దర్శించుకున్నారు.
ముద్దుర్తిలో నేత్రపర్వంగా శివపార్వతుల కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment