వైఎస్సార్‌సీపీ నేత భవనం కూల్చివేత
● స్పీకర్ ఇలాకాలో కక్షసాధింపు చర్యలు
నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడి అనుచరులు చెప్పిందే తడవుగా అధికారులు భవనాల కూల్చివేతలకు దిగుతున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ నాయకుడు చిటికెల కరుణాకర్ (కన్నబాబు) భవనాన్ని కూల్చేశారు. వృత్తిరీత్యా డాక్యుమెంట్ రైటర్ అయిన కన్నబాబు ఎన్నికల ముందు నుంచి వైఎస్సార్‌సీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని స్పీకర్ అనుచరులు కన్నబాబును ఆర్థికంగా దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కన్నబాబు తరఫున రిజిస్ట్రేషన్లు చేయవద్దని అధికారుల్ని ఒత్తిడి చేశారు. దీంతో ఆయన డాక్యుమెంట్లను అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం మానేశారు. ఆయన ఉపాధికి గండికొట్టిన టీడీపీ వర్గీయులు స్థానిక గచ్చపు వీధిలో ఉన్న దుకాణాలపై గురిపెట్టారు. విషయం తెలిసి కన్నబాబు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఆగస్టు 2న మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులు భవనం వద్దకు చేరుకున్నారు. దీంతో అధికారులు వెనకకు తగ్గారు. స్టే సమయం ముగియటం, మాజీ ఎమ్మెల్యే గణేష్ కాలుకు సర్జరీ చేయించుకుని హైదరాబాద్‌లో ఉండడంతో బిల్డింగ్ కూల్చేందుకు సిద్ధమయ్యారు.
గుట్టుచప్పుడు కాకుండా..
బిల్డింగ్ కూలగొడతారన్న విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. సోమవారం తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ, తహసీల్దార్ రామారావు, సీఐ గోవిందరావు భవనం వద్దకు చేరుకున్నారు. అటుగా ఎవరూ వెళ్లకుండా పాత మున్సిపల్ ఆఫీసర్ రోడ్డు, గచ్చపువీధి రోడ్లను పోలీసులు దిగ్బంధం చేశారు. ముందుగా భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మున్సిపల్ సిబ్బంది భవనం స్లాబ్‌ను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న భవన యజమాని అక్కడకు చేరుకుని, కోర్టు స్టే ఇచ్చిందని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఆదేశాలను పరిశీలించిన తరువాతే భవనాన్ని కూల్చుతున్నామని ఆయన బదులిచ్చారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు తదితరులు అక్కడకు చేరుకున్నారు. రాజకీయ నాయకుల ఆదేశాలతో ఈ విధంగా చేయటం సరికాదని కమిషనర్‌కు వారు వివరించే ప్రయత్నం చేయగా.. పద్ధతి ప్రకారమే చేస్తున్నానంటూ కమిషనర్ రెండు చేతులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment