శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
కొమ్మాది (విశాఖ): రుషికొండలో తిరుమల తిరుప తి దేవస్థానానికి చెందిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ద్వితీయ పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. సకల దేవతలను పవిత్రోత్సవాలకు ఆహ్వానించే క్రమంలో ముందుగా విష్వక్సేనుడికి పూజలు చేశారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పవిత్రాల ప్రతిష్ట, 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు పవిత్రాల సమర్పణ, 28న సాయంత్రం 6గంటల నుండి 8 గంటల వరకు పూర్ణాహుతి నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు ఉదయం 10–30 గంటల నుంచి 11–30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు వేణుగోపాల్ దీక్షితులు, ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటరమణ, వేద పండితులు, ఇన్‌స్పెక్టర్లు శివకుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment