కోడ్ కూసింది
● ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ● ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ ● ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు
21,555 మంది ఓటర్లు
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు తుది జాబితాను గత నెల 30న ప్రకటించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19,523 మంది ఓటర్లు ఉండేవారు. ప్రస్తుతం 21,555 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 12,948 మంది, మహిళలు 8,607 మంది. శ్రీకాకుళం జిల్లాలో 4,829 మంది, విజయనగరం జిల్లా 4,937 మంది, మన్యం పార్వతీపురం జిల్లాలో 2,262 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,448 మంది, విశాఖ జిల్లాలో 5,277 మంది, అనకాపల్లిలో 2,802 మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మొత్తం 123 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్నికల కమిషన్కు పంపారు.
మహారాణిపేట (విశాఖ): ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బుధవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 3న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి, 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన చేస్తారు. 13వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది, 27న పోలింగ్ పూర్తి చేసి, మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అభ్యర్థి ఎన్నికను అధికారికంగా ప్రకటించే వరకు ఎన్నికల నియామవళి అమలులో ఉంటుందని కలెక్టర్, ఎన్నికల ప్రధాని అధికారి ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 3న ఆయన అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఆరు జిల్లాల రెవెన్యూ అధికారులు(డీఆర్వో)లు వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఉత్తరాంద్ర టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘువర్మ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో పూర్తవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment