త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులుకు సందేశాలు చూపుతున్న బాధితుడు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మాటలు కలిపి.. నమ్మకం కలిగించి.. ముందస్తుగా రూ.15వేల నగదు తీసుకుని.. ఫోన్‌పేలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయకుండా ఉడాయించిన దుండగుడి ఉదంతం అనంతపురంలో చోటు చేసుకుంది. బాధితుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసనగర్‌లోని రామాలయం వద్ద సెల్‌పాయింట్ నిర్వహిస్తున్న మణికంఠ ఫోన్‌పే ట్రాన్స్‌ఫర్, వేలిముద్ర వేయించుకుని కమీషన్‌పై నగదు చెల్లింపులు చేసే ఏజెంట్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఓ అపరిచిత వ్యక్తి అతని వద్దకు వచ్చి ఫోన్ పే ద్వారా బదిలీ చేసి రూ.10వేల నగదు తీసుకున్నాడు. మాటామంతి చేసి అక్కడే కాసేపు గడిపాడు. శనివారం కూడా ఆ వ్యక్తి వచ్చి మణికంఠతో ముచ్చటించిన తర్వాత రూ.15వేల నగదు ఇవ్వు.. ఫోన్‌పేలో డబ్బు పంపుతానని చెప్పాడు. సరేనని కమీషన్ పట్టుకుని నగదు లెక్కపెట్టి మణికంఠ ఇచ్చాడు. అయితే ఆ అపరిచిత వ్యక్తి ఫోన్ పే చేయలేదు. అత్యవసరమన్నట్టుగా.. తన కొడుక్కు డబ్బు ఇచ్చి, తర్వాత ఫోన్‌పే పంపుతానని అక్కడి నుంచి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోయే సరికి మణికంఠ అనుమానం వచ్చి ఆ పరిసరాల్లో వెతికినా కనిపించలేదు.
అనంతరం అపరిచిత వ్యక్తి నుంచి మణికంఠకు పలు మెసేజీలు వచ్చాయి. ‘సారీ తమ్ముడు..రెండు రోజులుగా అన్నం కూడా లేదు. ఆకలేస్తోంది. విధిలేక నిన్ను మోసం చేయాల్సి వచ్చింది’ అంటూ సందేశంలో పేర్కొన్నాడు. బాధితుడు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తనకు న్యాయం చేయాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment