సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. పార్టీ అధినేత ‘స్కిల్ స్కాం’లో ఇరుక్కుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండు ఖైదీగా వెళ్లారు. దీనికి నిరసనగా టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే రోడ్డుమీదకు వచ్చి ఆందోళన చేసే వారే కరువయ్యారు. నామమాత్రంగా కూడా బంద్ జరగకపోవడంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పార్టీ పూర్తిగా తేలిపోయింది. చంద్రబాబు 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా మంచి చేసిందేమీ లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. డబ్బులిస్తామన్నా ఆందోళన చేసేందుకు జనం రాకపోవడంతో పార్టీ నాయకుల్లో నైరాశ్యం ఆవహించింది.
కరువైన ప్రజాదరణ
చంద్రబాబును జైలుకు పంపినందుకు నిరసనగా రెండు జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేసే అంశంపై చర్చించేందుకు ఈ నెల 12న టీడీపీ నాయకులు అనంతపురంలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి 200 మంది కూడా కేడర్ హాజరు కాలేదు. దీంతో రిలే నిరాహార దీక్షలు, వినతిపత్రాలు అందించడం, చంద్రబాబు గురించి గ్రామాల్లో చెప్పడం వంటివి ప్రజాదరణ లేకుండా ఎలా సాధ్యమన్న ఆలోచనలో పడ్డారు. బంద్ పిలుపునకే రానప్పుడు మండలాల వారీగా జనాన్ని రిలే దీక్షలకు తెప్పించడం సాధ్యమా అన్నది నాయకులను కలవరపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 63 మండలాలుంటే.. ఏ మండలంలోనూ పట్టుమని పదిమంది కార్యకర్తలు వచ్చే పరిస్థితి కనిపించలేదు. 41 లక్షల పై చిలుకు జనాభా ఉన్న ఉమ్మడి అనంత జిల్లాలో 4 వేల మంది కూడా బాబుకు మద్దతు ఇవ్వలేదే అని తెలుగుదేశం నాయకులు లోలోపల మదనపడుతున్నారు.
ఉచ్చు బిగుస్తుండటంతో...
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు రోజురోజుకూ ఉచ్చు బిగుసుకుంటోంది. బుధవారం హైకోర్టులో ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టి వేయాలని వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మరోవైపు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ... 2014–19 మధ్య జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని తేల్చింది. కంపెనీ ప్రమేయం లేకుండానే దాన్ని చేర్చి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇదొక్కటే కాదు మరిన్ని స్కాములు తెరమీదకు రావడంతో టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముందుకొచ్చి మాట్లాడటానికి జంకుతున్నారు. కిందిస్థాయి కేడర్‌లోనూ, కార్యకర్తల్లోనూ చంద్రబాబు తప్పు చేశారన్న భావన ఉండటంతో ఏ ముఖం పెట్టుకుని రిలే దీక్షలు చేపడతామని లోలోపల మదనపడుతున్నారు.
పాపం వెంటాడుతోంది|
టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ప్రజాధనం దోపిడీ చేసిన పాపం చంద్రబాబును వెంటాడుతోంది. ఈయనకు ప్రజల నుంచి మద్దతు లభించే పరిస్థితి లేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో చంద్రబాబుకు ఉచ్చు బిగుసుకుంది. పక్కా ఆధారాలతోనే ఆయన్ను జైలుకు పంపించారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను సమర్థిస్తూ ఆందోళన చేసే పరిస్థితి ఎందుకుంటుంది?
–కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్
టీడీపీది ముగిసిన శకం
తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. చంద్రబాబును నమ్మి ఆయన వెంట నడిచేవారు లేరు. కేడర్‌లో ఆందోళన ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకులెవరో ప్రజలకు తెలుసు. అందుకే కుంభకోణాల్లో ఇరుక్కుని చంద్రబాబు జైలుకెళ్లినా ఎవరూ రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి లేదు. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా బాబును కార్యకర్తలు నమ్మడం లేదు.
– డాక్టర్ తిప్పేస్వామి, ఎమ్మెల్యే, మడకశిర
Comments
Please login to add a commentAdd a comment