మా వారిని కాదని ఎలా ఇస్తారు?
అనంతపురం ఎడ్యుకేషన్: ‘విద్యాశాఖను చాలెంజ్‌గా తీసుకున్నా. రాష్ట్ర విద్యాశాఖను దేశంలోనే టాప్‌లో నిలబెడతా. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా పెట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం’– ఇవీ రెండు రోజుల కిందట విజయవాడలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలు. అదేరోజు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోయారు. మోడల్ స్కూల్‌లో వార్డెన్, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలను తీవ్రస్థాయిలో బెదిరించారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీటీ, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, అకౌంటెంట్, వార్డెన్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ఆయా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో 16 సీఆర్టీ, 19 పీజీటీ, 15 పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, 4 అకౌంటెంట్, 6 వార్డెన్ పోస్టులను భర్తీ చేశారు. ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా ఖాళీలను భర్తీ చేశారు. ఉరవకొండ మోడల్ స్కూల్‌లో వార్డెన్ పోస్టుకు బంగి సునీత, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు మాదిగ రాజేశ్వరి ఎంపికయ్యారు. సోమవారం జాయిన్ అయ్యేందుకు మోడల్‌స్కూల్‌కు వెళ్లగా టీడీపీకి చెందిన కొందరు చోటా నాయకులు అడ్డుకున్నారు. ‘మోడల్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల్లోనూ బయట వ్యక్తులెవరూ చేరకూడదు. మావాళ్లు చాలామంది ఉన్నారు. వారిని కాదని బయటవాళ్లు ఎలా చేరతారు?’ అని ప్రిన్సిపాల్‌ను బెదిరించారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరు ఉద్యోగుల నియామక పత్రాలను చేతికి తీసుకుని చింపేస్తామంటూ భయపెట్టారు. తమమాట కాదని ఇక్కడ చేరితే.. డ్యూటీ ఎలా చేస్తారో చూస్తాం అంటూ హెచ్చరించారు. దీంతో వారిద్దరినీ చేర్చుకోకుండా ప్రిన్సిపాల్ వెనక్కు పంపారు. బాధితులు మంగళవారం రెవెన్యూ భవన్‌లో కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత సమగ్రశిక్ష ఏపీసీతో మాట్లాడతానని బాధితులకు చెప్పి పంపారు.
కేజీబీవీ ప్రిన్సిపాల్‌కు బెదిరింపు
ఇద్దరిని విధుల్లోకి చేర్చుకోకుండా వెనక్కు పంపిన వైనం
కేశవ్ ఇలాకాలో రెచ్చిపోయిన ‘తమ్ముళ్లు’
Comments
Please login to add a commentAdd a comment