‘అపార్’ పూర్తి చేయాల్సిందే
అనంతపురం అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు సంబంధించి ఆధార్ తరహా అపార్ (ఆటేమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్) ఐడీ జనరేషన్‌ను కచ్చితంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. సకాలంలో పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల విద్య అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో విద్య, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ యూడైస్ 2024–25 కింద జిల్లాలో 3,70,767 మంది విద్యార్థులు ఉంటే ఇప్పటి వరకు 2,17,892 మంది ఆపార్ జనరేషన్ (58.77) శాతం మాత్రమే పూర్తి చేశారు. ఇది సరైన పనితీరు కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. ప్రతి పాఠశాలకు ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను కేటాయించాలని ఆదేశించారు. వారికి అపార్ జనరేషన్ బాధ్యత అప్పగించాలని డీపీఓను ఆదేశించారు. ప్రతి మండలాన్నీ రెండుగా విభజించి ఇద్దరు ఎంఈఓలకు పాఠశాలలను సమానంగా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. 110 ఆధార్ కేంద్రాలకు సంబంధించి షెడ్యూల్ తయారు చేయడంతో పాటు వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. రోజూ 10 వేల అపార్ ఐడీ జనరేట్ చేయాలని చెప్పారు. కార్యక్రమ వేగవంతానికి ఆధార్ నోడల్ అధికారి చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ ప్రక్రియ కోసం ప్రతి పాఠశాలలోనూ మూడు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రొఫైల్ అప్‌డేషన్‌కు ఒక బృందాన్ని, అపార్ ఐడీ జనరేషన్‌కు ఒక బృందాన్ని, నామినల్ రోల్స్ కోసం ఒక బృందాన్ని నియమించాలన్నారు.
విద్యార్థుల హాజరు పెరగాలి
విద్యార్థుల హాజరు పెరగాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 17,901 మంది డ్రాప్ అవుట్లు ఉన్నారని, ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు, ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. పీఎంశ్రీ ప్లే గ్రౌండ్లకు సంబంధించి 92 మంజూరు కాగా 48 పూర్తి చేశారని, మిగిలిన 44 త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఈఓ పరసాద్‌బాబు, డీపీఓ నాగరాజునాయుడు, సాంఘిక సంక్షేమశాఖ జేడీ ప్రతాప్‌సూర్యనారాయణరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి, డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, సమగ్ర శిక్ష ఏపీసీ నాగరాజు, ఆధార్ నోడల్ అధికారి నారపరెడ్డి, ఏపీఈడబ్ల్యూడీసీ ఈఈ రమణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment