ప్రాథమిక పరిశీలన 30 లోపు పూర్తి చేయండి
అనంతపురం అగ్రికల్చర్: డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యం పరికరాల మంజూరుకు సంబంధించి ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 30లోపు ప్రాథమిక పరిశీలన (ప్రిలిమినరీ ఇన్స్‌పెక్షన్) పూర్తి చేసి అర్హుల జాబితా సిధ్దం చేయాలని ఉద్యానశాఖ జిల్లా అధికారులను ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం ఆయన గుంటూరు నుంచి ఏపీఎంఐపీ పీఓ ఎం.వెంకటేశ్వర్లుతో కలసి సూక్ష్మ సాగు పథకం అమలుపై జిల్లా పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ జి.ఫిరోజ్‌ఖాన్, కంపెనీ డీసీఓలతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా 42,100 హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వాలని అనంతపురం జిల్లాకు లక్ష్యంగా ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌కే వేదికగా 39,637 మంది రైతులు 55,478 హెక్టార్లకు పరికరాలు కావాలని ఇప్పటికే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయన్నారు. అయితే ఇందులో 13,486 మంది రైతులకు 16,569 హెక్టార్లకు ఇవ్వడానికి వీలుగా ప్రాథమిక పరిశీలన చేశారన్నారు. ప్రస్తుతానికి 3,462 మంది రైతులు 4,094 హెక్టార్లకు కావాలని తమ వాటా కింద డిజిటల్ రూపంలో డీడీలు చెల్లించారని, 2,600 మంది రైతులకు 3,081 హెక్టార్లకు పరికరాలను కలెక్టర్ ద్వారా మంజూరు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇంకా మిగులు దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనపై దృష్టి సారించి, అర్హుల జాబితా సిద్ధం చేసి, బీఓక్యూ, బీఎంసీ, డీడీ చెల్లింపు, శ్యాంక్షన్, మెటీరియల్ సరఫరా, ఇన్‌స్టాలేషన్, తుది పరిశీలన (ఫైనల్ ఇన్స్‌పెక్షన్) తదితర ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment