పాలకుల పుణ్యమా అని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జడలు విప్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రి ఏఎస్పీగా నాలుగు రోజుల క్రితమే ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఏకంగా అఖిల భారత సర్వీసుల అధికారిని ఇక్కడికి కేటాయించడంతో అటు అసాంఘిక శక్తులతో పాటు ఇటు రాజకీయ నాయకులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మట్కా, గంజాయికి రాష్ట్రంలోనే కేంద్ర బిందువుగా మారిన తాడిపత్రి నియోజకవర్గంలో కొత్త ఏఎస్పీ రాకతో స్తబ్దత నెలకొన్నట్లు తెలి సింది. మట్కా ఏజెంట్లు, గంజాయి ముఠా, రకరకాల జూదం ఆడేవాళ్లు రెండురోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు. ఎక్కడైనా కొత్త పోలీసు అధికారి వచ్చీ రావడంతోనే అసాంఘిక కార్య కలాపాల కట్టడికి విస్తృతంగా దాడులు చేయడం మామూలే. అందుకే ఏఎస్పీ రాకతో తాడిపత్రిలో జూదరులు, మట్కాబీటర్లు తమ అక్రమ కార్యకలాపాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్టు సమాచారం.
ప్రజల్లో భయం భయం..
విచ్చలవిడి మట్కా కార్యకలాపాలతో తాడిపత్రి రెండో ముంబైగా పేరుగాంచింది. ఇక్కడ జూదం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఇటీవల పట్టణంలో గంజాయి ముఠా ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. మద్యం అక్రమ అమ్మకాలు, దొంగతనాలు, రేప్ కేసులు, హత్యలు పెరిగాయి. టెండర్ల ద్వారా తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నా.. ఇతర ప్రాంతాల వారు అనే కారణంగా వారికి అద్దెకు భవనాలు కూడా దక్కనివ్వకుండా అడ్డుకున్నారు. మరోవైపు పట్టణ సమీపంలోని పెన్నానదిలో విచ్చలవిడిగా ఇసుక తోడేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిత్యం వందల టిప్పర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తూ నది స్వరూపాన్నే మార్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్లు మిన్నకుండి పోతుండటంతో పోలీసులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీకి చెందిన నాయకులు దాడులు చేశారని బాధితులు ఫిర్యాదు చేసినా సీఐలు స్పందించడం లేదనే విమర్శలున్నాయి.
తీవ్రంగా ఒత్తిళ్లు..
తాడిపత్రిలో పని చేసే అధికారులు జేసీ బ్రదర్స్ నుంచి తీవ్రంగా రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో గ్రూప్–1 అధికారి అయిన డీఎస్పీ చైతన్య తమకు సహకరించలేదన్న ఉద్దేశంతో జేసీ కుటుంబం ముప్పు తిప్పలు పెట్టి ఆయనను వేరే ప్రాంతానికి బదిలీ చేయించింది. కూటమి సర్కారు వచ్చాక ఇక్కడ ఒక తహసీల్దార్ విధుల్లో చేరేందుకు కూడా భయపడ్డారు. ఇటీవల ఏ తప్పూ లేకుండానే సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డితో ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పించారు. దీంతో కిందిస్థాయి పోలీసుల్లో ఆత్మస్థైర్యం దెబ్బ తింది. ఈ పరిస్థితులను నూతన ఏఎస్పీ రోహిత్‌కుమార్ ఎలా ఎదుర్కొంటారనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఏదిఏమైనా కొత్త ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి తాడిపత్రిలో అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ ఆయన ‘హిట్’ అవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ఏఎస్పీ రాకతో ‘తాడిపత్రి’లో మారిన వాతావరణం
అసాంఘిక శక్తుల అప్రమత్తం
జూదరులు, గంజాయి ముఠా ఆచితూచి అడుగులు
అధికారి తీరును బట్టి ముందుకెళ్లాలన్న ఆలోచనలో మట్కా బీటర్లు
పోలీసుల తీరుపై ఇప్పటికే
విసుగెత్తిన స్థానికులు
ఐపీఎస్‌పై బోలెడన్ని ఆశలు
Comments
Please login to add a commentAdd a comment