సమగ్ర గడప దాటని నిధులు
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష అధికారుల నిర్లక్షం కారణంగా అభివృద్ధి పనుల నిధులు ఆ కార్యాలయ గడప దాటడం లేదు. నిర్మాణాలకు సంబంధించిన నిధులు ఎస్‌ఎంసీ ఖాతాల్లోకి జమ చేయచేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. నెలలు తరబడి పేరుకుపోయిన బిల్లులకు సంబంధించిన ఫైలు ఇప్పటి వరకూ కలెక్టర్ వద్దకు చేరలేదంటే నిర్లక్ష్యం ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. 2024–25 సంవత్సరానికి సంబంధించి ఆనివల్ వర్క్ ప్లాన్ (ఏడబ్ల్యూపీ) కింద జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) లైబ్రరీ, ల్యాబ్, కంప్యూటర్, ఆర్ట్–క్రాఫ్ట్ తరగతి గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కో గదికి రూ. 20 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు. జిల్లాలో మొత్తం 26 గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎస్‌ఎంసీ తీర్మానాల మేరకు పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు.
గత అక్టోబరులో బడ్జెట్ రిలీజ్
తరగతి గదుల నిర్మాణాలకు సంబంధించి 25 శాతం బడ్జెట్‌ను గత ఏడాది అక్టోబర్‌లోనే అప్పటి జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో జిల్లాకు దాదాపు రూ. 2 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ బడ్జెట్‌ను కలెక్టర్ అనుమతులు తీసుకుని ఎస్‌ఎంసీ ఖాతాలకు బదిలీ చేయాల్సి ఉంది. ‘వాల్యూ ఆఫ్ వర్క్ డన్’ ఆధారంగా ఇంజినీరింగ్ అధికారులు నిర్ధారించిన తర్వాత బిల్లుల చెల్లింపునకు ఎస్‌ఎంసీ సభ్యులు అనుమతిలిస్తారు. అయితే ఇందులో ఏ ఒక్క ప్రక్రియనూ సమగ్ర శిక్ష అధికారులు పూర్తి చేయలేకపోయారు. ఇప్పటి వరకూ కలెక్టర్ కనీసం ఫైలు కూడా పెట్టలేదు. మరో వైపు పనులు చేసిన కాంట్రాక్టర్లు పార్ట్ బిల్లుల కోసం ఎస్‌ఎంసీలు, సమగ్రశిక్ష కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఈఈ ‘డ్యూయల్ రోల్’తో తంటాలు
జిల్లా సమగ్రశిక్ష ఈఈగా కొనసాగుతున్న శంకరయ్య వాస్తవానికి శ్రీ సత్యసాయి జిల్లా సమగ్రశిక్ష రెగ్యులర్ ఈఈగా ఉన్నారు. రెండు జిల్లాలను సమన్వయం చేసుకోవడంలో విభాగాధిపతి విఫలమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన రెగ్యులర్‌గా ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం ఇప్పటికే అక్కడి కలెక్టర్ ఆమోదంతో 25 శాతం నిధులను ఎస్‌ఎంసీ ఖాతాల్లో జమ చేశారు. అనంతపురం జిల్లాలో మాత్రం ఇప్పటి వరకూ ఆ దిశగా ఆయన ఫైలు కదపలేకపోయారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
బయట జిల్లాల్లో పని చేస్తూ ఇక్కడ హెచ్‌ఓడీ ఇన్‌చార్జ్‌లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదంటూ సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో కలెక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ నిబంధన సమగ్రశిక్షలో బేఖాతరవుతోంది. ఇప్పటికీ ఈఈ ఇన్‌చార్జ్‌గా శ్రీసత్యసాయి జిల్లా అధికారే వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాల్లో పని చేస్తుండడం వల్ల ఆయన ఎక్కడా అందుబాటులో ఉండడం లేదని ఉద్యోగులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు వాపోతున్నారు.
కొసమెరుపు
ఎస్‌ఎంసీ ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల అంశంపై ఈఈ శంకరయ్యను వివరణ కోరగా...13 రోజుల కిందటే ఏపీసీ (ప్రస్తుత డీఈఓ)కు ఫైలు పెట్టానని చెప్పారు. డీఈఓను వివరణ కోరగా...తనకు ఫిజికల్‌గా ఎలాంటి ఫైలు అందలేదని పేర్కొన్నారు.
కేజీబీవీల్లో లైబ్రరీ, ల్యాబ్, కంప్యూటర్, ఆర్ట్–క్రాఫ్ట్ తరగతి గదుల నిర్మాణాలు
ఒక్కో గదికి రూ.20 లక్షల కేటాయింపు
ఎస్‌ఎంసీల తీర్మానాల మేరకు చేపట్టిన నిర్మాణ పనులు
25 శాతం అడ్వాన్స్ ఎస్‌ఎంసీ ఖాతాలకు పంపని వైనం
Comments
Please login to add a commentAdd a comment