No Headline
అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్‌లో పిల్లలకు వ్యాయామ విద్యను బోధించాల్సిన ఓ పీడీ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చెలరేగిపోతున్నాడు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు మించి విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు, ఉద్యోగులను శాసిస్తున్నాడు. ఇటీవల డీఈఓ కార్యాలయంలోని ఏఎస్‌ఓ పోస్టుకు తాను చెప్పిన టీచరును తీసుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తుండటంతో అధికారులు కూడా వణికిపోతున్నారు. కాగా, సదరు టీచరు గతంలో ఏఎస్‌ఓగా పని చేశాడు. అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి, ఆరోపణలు రావడంతో తప్పించి బడికి పంపారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ టీచర్ తెరపైకి రాగా.. అతనికి మద్దతుగా పీడీ రంగంలోకి దిగాడు. టీచరును ఆ పోస్టులోకి తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
వారెవరూ కనిపించరాదట..!
ఈనెల 24న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ఏర్పాట్లు, వసతి, రవాణా తదితర పనులను పర్యవేక్షించేందుకు డీఈఓ తన సిబ్బందితో మాట్లాడి కొందరు టీచర్లను స్పెషల్ డ్యూటీకింద వేశారు. వారంతా కమిషనర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే, సోమవారం డీఈఓ కార్యాలయానికి వెళ్లిన పీడీ... డ్యూటీలకు వేసిన వారి జాబితాను తీసుకుని కొందరి పేర్లు ప్రస్తావిస్తూ వీరిని ఎలా డ్యూటీకి వేస్తారంటూ ఉద్యోగులపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. వీరెవరూ కమిషనర్ పర్యటనలో కనిపించకూడదంటూ స్వయంగా డీఈఓ సమక్షంలోనే హెచ్చరికలు జారీ చేశాడని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ..
తన సామాజికవర్గానికి చెందిన ఎంపీ, జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ పీడీ బెదిరింపులకు గురిచేస్తున్నాడు.తాను వారితో సన్నిహితంగా ఉంటానని, విద్యాశాఖలో ఏ చిన్న పని ఉన్నా ఎంపీ, ఎమ్మెల్యే తనతో చర్చించే నిర్ణయం తీసుకుంటారంటూ చెబుతున్నట్లు తెలిసింది. తాను చెబితే ఎంపీ, ఎమ్మెల్యే చెప్పినట్టేనంటూ బెదిరిస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉంటూ పార్టీ కోసం పని చేసిన టీచర్లు సైతం ఈయన దెబ్బకు బెదిరిపోతున్నారు. ఇలాంటివారి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ చెబుతుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment