కూటమి ప్రభుత్వం రాగానే ఆ ప్రజాప్రతినిధి అక్రమాలకు దారుల
●‘అనంత’లో వసూళ్ల పర్వం ●ఎగ్జిబిషన్ నిర్వహణకు రూ. పది లక్షల డిమాండ్
●లేదంటే అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఫోన్లు
●టీడీపీలోనే మరో వర్గాన్ని ఆశ్రయించిన బాధితుడు
●రచ్చ అవుతుందని గ్రహించి వెనక్కి తగ్గిన ప్రజాప్రతినిధి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి వసూళ్ల దెబ్బకు వ్యాపారులు మొదలు బిల్డర్ల వరకూ హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పీడీఎస్ బియ్యం నుంచి ప్రారంభించి కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణదారుల వరకూ అందరితోనూ వసూళ్ల బేరం మొదలెట్టిన సదరు ప్రజాప్రతినిధి... తాజాగా ఎగ్జిబిషన్, సర్కస్ కంపెనీల నిర్వాహకులనూ వదల్లేదు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనాలను నిలుపుకోవాలంటే కూడా ఒక్కో వాహనదారుడు రూ.2 వేలు ఇవ్వాలని పట్టుబట్టారు. ఆయన ‘పైసావసూల్’ పర్వం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
రూ. పది లక్షలిస్తేనే ఎగ్జిబిషన్..!
ఇటీవల రుద్రంపేటలో ఎగ్జిబిషన్ పెట్టేందుకు ఓ వ్యక్తి అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. అన్ని విభా గాలకు మామూళ్లివ్వనిదే అనుమతులు ఇవ్వలేదు. ఇంతలోనే సదరు ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి కలవగానే.. రూ.10 లక్షలు ఇస్తేనే ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని, లేదంటే కుదరదని తేల్చి చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు తాను ఇవ్వలేనని కరాఖండీగా చెప్పి వచ్చేయగా... సదరు ప్రజాప్రతినిధి ఫోర్త్ టౌన్ సీఐకి ఫోన్ చేసి ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఐ నుంచి ఫోన్ రావడంతో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు వెళ్లి ఆయనను కలవగా.. ‘అన్న’ను ఓసారి కలవాలని సీఐ చెప్పడంతో హతాశులయ్యారు.
మాజీ ఎమ్మెల్యే వద్దకు పంచాయితీ..
ప్రజాప్రతినిధి వ్యవహారాన్ని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు నగర టీడీపీలో మరో వర్గానికి ప్రతినిధిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఫోర్త్ టౌన్ సీఐకి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిసింది. వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారయ్యేలా ఉందని గుర్తించిన సీఐ వెంటనే అనుమతులిచ్చేసినట్లు తెలిసింది. ఈ విషయం ప్రజాప్రతినిధి దృష్టికి కూడా సీఐ తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని మీడియా ముందుకు తీసుకెళతారనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధి వెనక్కు తగ్గినట్టు తెలిసింది.
వాహనాల స్టాండ్‌కూ సుంకమే!
అనంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న స్థలంలో నిత్యం పలు 407 అద్దె వాహనాలు నిలబడి ఉంటాయి. అయితే అక్కడ ఇకపై వాహనాలు నిలుపుకోవాలంటే ఒక్కో వాహనదారుడు నెలానెలా తనకు రూ.2 వేలు సమర్పించుకోవాలంటూ ప్రజాప్రతినిధి నుంచి ఆదేశాలు వచ్చాయని బాధితులు చెబుతున్నారు. ప్రతి ఏటా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు, ఇతర రాష్ట్రాల నుంచి కాటన్ వస్త్రాల వ్యాపారులు వచ్చి ఎగ్జిబిషన్లు పెడుతుంటారు. తాజాగా గుత్తి రోడ్డులో ఓ ఎగ్జిబిషన్ నడుస్తోంది. వీటన్నిటి నుంచి కూడా మామూళ్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సదరు ప్రజాప్రతినిధి దెబ్బకు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకూ హడలిపోతున్నారు. కూటమి పాలన అంటే ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment