పాతుకుపోయిన డీటీలపై ఆరా
● వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: జిల్లా కేంద్రాన్ని వీడకుండా అనేక ఏళ్లుగా పాతుకుపోయిన డిప్యూటీ తహసీల్దార్లపై కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆరా తీస్తున్నారు. ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పాతుకుపోయారు’ కథనానికి ఆయన స్పందించారు. డిప్యూటీ తహసీల్దార్లు ఎందరు ఉన్నారు.. ఎవరు ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు.. ఎన్ని ఏళ్లుగా జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు.. తదితర వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని పరిపాలనా విభాగం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆ మేరకు విభాగం సిబ్బంది వివిధ శాఖలకు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు.
ఏ–1గా శోభారాణి నియామకం
కలెక్టరేట్ పరిపాలనా విభాగం ఏ–1 క్లర్క్‌గా డిప్యూటీ తహసీల్దారు శోభారాణిని నియమించారు. మంగళవారం ఆమె బాధ్యతలను స్వీకరించారు. గత నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘‘అమ్మో ఏ–1 సీటా’’ కథనానికి కలెక్టర్ స్పందించారు. అత్యంత కీలకమైన ఏ–1 స్థానంలో అనుభవం ఉన్న అధికారిని నియమించాలనే విషయంపై కసరత్తు చేసిన తరువాత శోభారాణిని నియమించినట్లు సమాచారం.
పోక్సో కేసులో
ముద్దాయికి ఐదేళ్ల జైలు
గుంతకల్లు/అనంతపురం: పోక్సో కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే, రూ.1,000 జరిమానా విధించారు. గుంతకల్లు టూటౌన్ సీఐ ఏపీ మస్తాన్‌వలి తెలిపిన మేరకు.. గుంతకల్లు తిలక్‌నగర్‌కు చెందిన షేక్ షేక్షావలి చిల్లర దుకాణం నడిపేవాడు. 2020 జనవరి 16న ఓ దళిత బాలిక చాక్లెట్ కొనుక్కోవడానికి దుకాణం వద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే షేక్షావలి ఆమెను లోపలికి పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన బాలిక బిగ్గరగా అరుచుకుంటూ ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి టూటౌన్ సీఐ చిన్న గోవిందప్ప, డీఎస్పీ ఖాసీంసాబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేసి అనంతపురం జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో స్పెషల్ పీపీ ఈశ్వరమ్మ 14 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో జడ్జి రాజ్యలక్ష్మీ మంగళవారం ముద్దాయి షేక్షావలికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అలాగే, రూ.1,000 జరిమానా విధించారు. బాలికకు ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సీఐ వెంకటేష్ నాయక్, గుంతకల్లు టూటౌన్ సీఐ ఏపీ మస్తాన్ పర్యవేక్షణలో లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు నాగార్జున, ఉదయ్ నాయక్‌లు సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టి ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేశారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ జగదీష్ అభినందించారు.
ముగిసిన కానిస్టేబుల్
దేహదారుఢ్య పరీక్షలు
అనంతపురం: జిల్లాలో గత నెల 30 నుంచి సాగుతున్న కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. వివిధ కారణాలతో గైర్హాజరైన వారితో పాటు ఎత్తు, ఛాతీ కొలతలకు అప్పీలు చేసుకున్న అభ్యర్థులకు ముగింపు రోజు అవకాశం కల్పించారు.
నేడు అల్ట్రా మారథాన్
అనంతపురం: ఆర్డీటీ ఆధ్వర్యంలో బుధవారం అల్ట్రా మారథాన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ మంగళవారం తెలిపారు. బెళుగుప్ప మండలం వెంకటాద్రిపల్లిలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే మారథాన్ మొత్తం 170 కిలోమీటర్ల మేర సాగి శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని ఆర్డీటీ కార్యాలయం వద్ద ముగుస్తుంది. స్పెయిన్‌కు చెందిన అల్ట్రామారథాన్ రన్నర్ జువెల్ మానువెల్ నేతృత్వంలో భారతదేశానికి చెందిన 120 మంది మొత్తం నాలుగు బృందాలుగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. 10 కిలోమీటర్లు ఏకధాటిగా ఒక టీం రన్నింగ్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment