అల్లనేరేడు చెట్ల నరికివేత
రాప్తాడు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో కనుమరుగైపోయిన ఆస్తుల విధ్వంసం... కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత మళ్లీ జడలు విప్పుకుంది. అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత పేరు చెప్పి మరీ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మండలంలోని పుల్లలరేవు గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పెద్ద ఓబులేసుకు చెందిన 61 అల్ల నేరేడు చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. బాధిత రైతు తెలిపిన మేరకు.... సర్వే నంబర్ 88–3 (న్యూ)లో తనకున్న 2.86 ఎకరాల పొలంలో రైతు ఓబులేసు రెండేళ్ల క్రితం 200 అల్లనేరెడు మొక్కలను నాటాడు. ఈ నెల 17న 15 చెట్లు, తాజాగా సోమవారం రాత్రి 40 చెట్లను నరికి వేశారు. రాజకీయ కక్షతో స్థానిక టీడీపీ నాయకులు తలారి విజయ్, అశోక్ కుమార్, చంద్రమోహన్, నరేంద్ర, నారాయణ స్వామి, సాయినాథనాయుడు, అక్కులన్న, గురుప్రసాద్, క్రిష్ణయ్య, చెన్నారెడ్డి ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు.
అండగా ఉంటాం
అధైర్య పడోద్దు... అండగా ఉంటామని బాధిత రైతు ఓబులేసు, ఆయన కుటుంబసభ్యులకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భరోసానిచ్చారు. మంగళవారం ఆయన పెద్ద ఓబులేసు పొలంలో నరికి వేసిన అల్లనేరేడు చెట్లను పరిశీలించారు. ఘటనపై ఓబులేసు, ఆయన భార్య యశోదమ్మతో ఆరా తీశారు. నరికివేసిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలు నాటుకునేందుకు ఆర్థిక సాయం చేస్తానన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. తాడిపత్రి, యల్లనూరు ప్రాంతాలకు పరిమితమైన చెట్ల నరికివేత సంస్కృతిని స్థానిక టీడీపీ నాయకులు ఇక్కడకు తీసుకురావడం బాధాకరమన్నారు. కలెక్టర్, ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చొరవ తీసుకుంటానన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్త పొలంలో విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment