క్రైస్తవులంటే చంద్రబాబు, పవన్‌కు చిన్నచూపు
అనంతపురం కార్పొరేషన్: క్రైస్తవులంటే సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కు చిన్న చూపని వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు వైవీ బాబు విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్చకులు, మౌజాన్లు, ఇమాంలు, పాస్టర్లకు అందజేసిన గౌరవవేతనాన్ని కొనసాగించకుండా అన్యాయం చేయడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. బిషప్ వాసు అనిల్‌కాంత్, పాస్లర్లు జాకోబు, అరోహన్, అబ్రహాం, సాల్మోన్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ నేత చిలకల థామస్‌తో కలసి జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం అందజేసినట్లుగానే పాస్టర్లకు రూ.5 వేల గౌరవవేతనాన్ని అందజేయాలని కోరారు. గౌరవ వేతనం జాప్యంతో జిల్లాలోని 233 పాస్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెరూసలేం యాత్రకు, విదేశీ విద్య, పెళ్లికానుకనూ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలన్నారు.
గూడ్స్ ఢీకొని వృద్ధుడి దుర్మరణం
అనంతపురం సిటీ/గార్లదిన్నె : గూడ్స్ రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నెకు బి.నారాయణ (72) తనకున్న పొలంలో చీనీ సాగు చేపట్టాడు. ఈ క్రమంలో మంగళవారం కాలినడకన చీనీ తోటకు బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో గూడ్స్ రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఎగిరి సుదూరంగా పొదల మధ్య పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గూడ్స్ లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ మహమ్మద్ రఫీ, అనంతపురం జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment