వ్యక్తి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... పుట్లూరు మండలం తక్కళ్లపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి (62) కొంత కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గతంలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నా ఫలితం దక్కలేదు. నొప్పి తీవ్రత తాళలేని ఆయన మంగళవారం తాడిపత్రి సమీపంలోని పుట్లూరు మార్గంలో ఉన్న రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పీఎస్ ఎస్‌ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
దళారుల చేతుల్లో
కంది రైతులు దగా : ఏఐకేఎస్
అనంతపురం అర్బన్: కంది పంట సాగు చేసిన రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని... దీనిని ఆసరాగా చేసుకుని దళారులు కుమ్మకై రైతులను దగా చేస్తున్నారని రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు నెలల క్రితం క్వింటా కందులను రూ.10వేలతో కొనుగోలు చేసిన దళారులు.. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి కారణంగా క్వింటా రూ.6 వేలు, రూ.6,500 మించి కొనడం లేదన్నారు. ఈ నెల 25వ తేదీలోపు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా రూ.7.550 మద్దతు ధరతో పాటు బోనస్ కింద రూ.2 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment