సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు ముగిశాయి. దాదాపు మూడున్నర గంటల పాటు వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం దీనిపై గురువారం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. అంతకు ముందు సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబు ఆలోచనల నుంచే స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం పుట్టిందని కోర్టుకు నివేదించారు. దీనికి సంబంధించిన ప్రతి విషయం ఆయనకు తెలుసని, ఈ కుంభకోణంలో అంతిమ లబ్దిదారులు చంద్రబాబుతో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులేనని నివేదించారు.
తమ వద్ద ఉన్న ఆధారాలను దగ్గర పెట్టుకుని చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత పెద్ద కుంభకోణంలో 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబును తాము (సీఐడీ) విచారిస్తే ఆయనకు వ చ్చిన నష్టం ఏమీ ఉండదని, అదే తాము విచారించకుంటే దర్యాప్తునకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. పోలీసు కస్టడీకి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టే చంద్రబాబు పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
నిందితుడు కోర్టును అలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదని శాసించలేడన్నారు. నిందితుడు ముందు న్యాయం మోకరిల్లరాదని, ఒకవేళ అలా జరిగితే వ్యవస్థ కుప్పకూలినట్లేనన్నారు. విచారణలో మౌనంగా ఉండే హక్కు నిందితుడికి ఉందని, అయితే విచారణకు సహకరించాల్సిన బాధ్యత కూడా నిందితుడిపై ఉందని కోర్టుకు నివేదించారు. ఈ కుంభకోణాన్ని రాజకీయ కారణాలతో వెలికి తీసినట్లు చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారని, వాస్తవానికి దీన్ని పుణె జీఎస్‌టీ అధికారులు వెలికి తీశారని తెలిపారు.
ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను జీఎస్‌టీ అధికారులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ సర్కారు) దృష్టికి తెచ్చారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా దారి మళ్లించారో వివరించారని చెప్పారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో జీఎస్‌టీ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. ఆ తరువాత షెల్ కంపెనీల గుట్టు రట్టు కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి వాటితో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశాయని చెప్పారు.
ఐటీ శాఖ నోటీసులు ఇవ్వగానే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు విదేశాలకు పారిపోయారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఇలాంటి కేసును రాజకీయ ప్రేరేపితం, కక్ష సాధింపు అనడం దారుణమన్నారు. చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందని, దీన్ని బట్టి ఎంత పకడ్బందీగా ఈ కుంభకోణానికి వ్యూహరచన చేశారో అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. చంద్రబాబును విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు.
ఇప్పుడు కస్టడీ కోరడం ఏమిటి?
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించామని, వాటి ఆధారంగా చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాలని సీఐడీ మొదటి రోజే కోర్టును కోరిందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు సేకరించినప్పుడు ఇప్పుడు తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఏముందన్నారు. స్కిల్ కేసులో 2021లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 2023లో చంద్రబాబును అరెస్ట్ చేసిందని, ఇంత కాలం సీఐడీ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. వారి అలసత్వానికి చంద్రబాబును కస్టడీకి కోరడానికి వీల్లేదన్నారు.
45 ఏళ్లుగా చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చిన ప్రతిష్టను కాలరాసేందుకే సీఐడీ ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతోందన్నారు. సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తున్న సమయంలో దర్యాప్తు అధికారులు ఆ వివరాలను మీడియాకు లీక్ చేశారని తెలిపారు. చంద్రబాబు ఎమ్మెల్యే కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ కేసు మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదన్నారు.
పరిధి లేకుంటే ఎందుకీ పిటిషన్లు?
దీనికి సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి, స్పెషల్ పీపీ వివేకానంద తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులు.. ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో చార్జిషీట్ దాఖలైన తరువాత ట్రయల్ మొదలు పెట్టి విచారణ కొనసాగించేందుకు మాత్రమే ఉద్దేశించినవన్నారు. రిమాండ్ విషయంలో ఆ కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. ఒకవేళ ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదని భావిస్తే ఆ విషయాన్ని మొదటే చెప్పి ఉండాల్సిందన్నారు. ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేకుంటే హౌస్ రిమాండ్, బెయిల్, మధ్యంతర బెయిల్ ఇలా ఇన్ని పిటిషన్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ఒకవైపు పరిధి లేదంటూనే మరో వైపు ఇన్ని పిటిషన్లు వేయడం చంద్రబాబు తీరును తెలియచేస్తోందన్నారు.
మేం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు..
ఏసీబీ కోర్టు కేసు విచారణ మొదలు కాగానే సీఐడీ కస్టడీ పిటిషన్‌లో చంద్రబాబు దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించింది. అందులో కోర్టును శంకించేలా పేర్కొన్న అంశాలపై అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు న్యాయవాదుల తీరుతో ఒకింత మనస్తాపం చెందిన కోర్టు.. ఈ కేసును తాము విచారించడంపై మీకేమైనా అభ్యంతరం ఉందా? అంటూ సీఐడీ న్యాయవాదులను ప్రశ్నించింది.
నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమకు అభ్యంతరం లేదని సీఐడీ న్యాయవాదులు చెప్పారు. ఇదే ప్రశ్నను చంద్రబాబు తరఫు న్యాయవాదులను కోర్టు అడిగినప్పటికీ వారు మౌనంగా ఉన్నారు. అయినప్పటికీ కోర్టు మరోసారి అడగటంతో.. తాము సర్టిఫై చేయాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఒకింత తీవ్ర స్వరంతో బదులిచ్చారు. దీంతో కోర్టు విచారణను ప్రారంభించింది.
ఆ దృశ్యాలతో మాకేం సంబంధం లేదు..
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ దృశ్యాలు మీడియాలో రావడంపై ప్రశ్నించింది. ఆ దృశ్యాలను తాము లీక్ చేశామంటున్న చంద్రబాబు న్యాయవాదులు అందుకు ఆధారాలుంటే చూపాలని సీఐడీ స్పెషల్ పీపీ వివేకానంద కోరారు. ఆ దృశ్యాలు మీడియాలో ఎలా వచ్చాయో, వాటిని ఎవరు చిత్రీకరించారో తమకు తెలియదన్నారు. విచారణ రోజు చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు, సహాయకులు కూడా కలిశారని కోర్టు దృష్టికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment