చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల నుంచి కనీస స్పందన కరువు
హైకోర్టు ఆదేశాలతోనైనా చలనం వస్తుందని భావిస్తున్నా
గత ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో కేసుకు బలం చేకూరింది
ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి
2006లో నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్‌కు చేరి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్లింది. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి నిర్వాహకులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. మార్గదర్శిపై పోరాడుతున్న వారిని కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాపై రూ.50 లక్షల పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్‌లో ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే.. ఆ కేసు నుంచి బయటడతాను. కేసు వేయడంతో చివరి వరకు పోరాటం చేయాల్సి వస్తోంది.
– ఉండవల్లి అరుణ్‌కుమార్
సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టులో వాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాల నుంచి కనీస స్పందన కరువైందని ఆరోపించారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతోనైనా వాళ్లలో చలనం కలుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
రాజమహేంద్రవరంలోని ఓ బుక్ హౌస్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో ఈ కేసుకు బలం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు దివంగత రామోజీరావు, కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎలా స్పందిస్తారో తెలియడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే గౌరవం దక్కుతుందన్నారు. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప.. అన్యాయం జరగదని చెప్పారు.
రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలని కోరారు. మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించిన వడ్డీల గురించి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. డిపాజిట్ల సొమ్ము అందరికీ అందిందా? లేదా? అన్న విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రకటన ఇవ్వాలని హైకోర్టు సూచించిందన్నారు. డిపాజిట్‌దారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో నింపి ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించానని తెలిపారు. తాము ఎవరికి డబ్బు చెల్లించామన్న వివరాలను మార్గదర్శి 70 వేల పేజీల్లో నింపి సుప్రీంకోర్టుకు అందించిందని చెప్పారు.
నాడు చెప్పిందే.. నేడు నిజమైంది
2006 నవంబర్ 6వ తేదీన అప్పటి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరానికి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణ విషయంలో తాను ఏం ఫిర్యాదు చేశానో అదే విషయాన్ని ఆర్‌బీఐ సైతం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొందని ఉండవల్లి చెప్పారు. మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం పేరుతో డిపాజిట్ల వసూళ్లలో 45ఎస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసిందన్నారు.
మార్గదర్శిపై తన పోరాటాన్ని కొందరు తప్పు పట్టారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చేసిన విమర్శల్లో నిజం లేదన్నారు. కేసు పోరాటంలో తనకు ఎలాంటి రహస్య ఎజెండా లేదని స్పష్టం చేశారు. చిట్ ఫండ్ చట్టాలకు తాము అతీతం అని మార్గదర్శి భావించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చట్టాలు పాటించడం లేదని దుయ్యబట్టారు. ఇటీవల కాకినాడలో జయలక్ష్మి చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేశారని ఉదహరించారు. రామోజీ నిబంధనలు పాటించక పోవడంతో మిగిలినవి సైతం అదే దారిలో వెళుతున్నాయన్నారు.
విలీన మండలాలను కాపాడుకోవాలి
రాష్ట్ర విభజన విషయంలో విలీన మండలాలు తెలంగాణ పరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరçఫున గతంలో వైఎస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో ఇప్పుడు కూడా అదే చేయాలని చంద్రబాబును కోరారు. 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉన్నట్టు విశాఖపట్నంకు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త నీతి ఆయోగ్‌కు చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడైందని, ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.
ఓట్ల శాతంపై కదలికేదీ?
మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏపీలో పోలైన ఓట్ల కన్నా 12.54 శాతం ఓట్లు, ఒడిశాలో 12.4 శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించినట్టు ప్రకటించిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి.. ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డి్రస్టాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment