పేదవాడు ఎలా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితులు పోయి.. ప్రతి పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో 99 శాతానికిపైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి ఉంది. అయితే సాంకేతిక కారణాలో, మరే ఇతర కారణాల వల్లో మిగతా ఒక్క శాతం మంది కూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా, దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేసేందుకు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ఉద్యమంగా నిర్వహిస్తున్నామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ప్రతి ఇంటికీ వెళ్లి.. ఏమైనా సమస్యలున్నాయా అని అడుగుతున్న తొలి ప్రభుత్వం ఇదేనని స్పష్టం చేశారు. పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం.. ఇంతగా మమకారం చూపిస్తున్న ప్రభుత్వం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చని చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరూ కూడా పలానా సేవలు, పలానా పథకం లబ్ధి అందలేదని చెప్పే అవకాశం ఉండకూడని విధంగా సమస్యలు పరిష్కరించాలన్నదే ధ్యేయమని పునరుద్ఘాటించారు.
అందులో భాగంగానే జల్లెడ పట్టి.. అర్హులను గుర్తించి, పథకాలే కాదు వారికి కావలసిన డాక్యుమెంటేషన్లను కూడా ఈ కార్యక్రమంలో ఇస్తారని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, మండల, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులు అందరూ.. నేరుగా పేద లబి్ధదారుల దగ్గరకు వెళ్లడమే జగనన్న సురక్షా కార్యక్రమం అన్నారు. నోరు తెరిచి అడగలేని, అర్హత ఉండీ పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హుల తలుపు తట్టి, లబ్ధి చేకూర్చే మంచి కార్యక్రమం అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
అర్హుల కోసం జల్లెడ పడతాం
♦ అర్హులెవ్వరూ మిగిలిపోకూడదని ప్రతి ఆరు నెలలకు ఒకసారి జూలై, డిసెంబర్ మాసాల్లో పథకాలు మంజూరు చేస్తున్నాం. దీనికి మరో ప్రయత్నంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మిగిలిపోయిన అర్హుల కోసం జల్లెడ పట్టే ఈ కార్యక్రమం నెల పాటు కొనసాగుతుంది.
♦ ఆదాయం, కులం, బర్త్, కొత్త రేషన్ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్‌కు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డుల్లో మార్పులు తదితర సేవలన్నీ ఈ కార్యక్రమం కింద చేపడతారు. దాదాపు 11 రకాల సేవలు ఎలాంటి సర్విసు చార్జీ లేకుండా అందించేలా అడుగులు వేస్తున్నాం. ఆధార్ కార్డుల మార్పులకు కోసం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి 2,500 సెంటర్లు ఏర్పాటు చేయించాం. వాటికి సంబంధించిన విధి, విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఆ మేరకు సేవలను జగనన్న సురక్ష కార్యక్రమం కింద అందిస్తారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తడుతూ..
♦ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, మన ప్రభుత్వం మీద ప్రేమ ఉన్న ఉత్సాహవంతులు ఒక బృందంగా ఏర్పడి వారం రోజులపాటు రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రతి ఇంటి తలుపు తడతారు. లబ్ధి అందని వారు, ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, పరిష్కారానికి ప్రయత్నిస్తారు. వారి దగ్గర నుంచి డాక్యుమెంట్లు సేకరించి సచివాలయంలో సమర్పిస్తారు.
♦ ఒక టోకెన్ నంబరు జనరేట్ చేసి, సర్వీసు రిక్వెస్ట్ నంబర్ కేటాయించి.. దానిని ఆయా కుటుంబాలకు అందిస్తారు. సంబంధిత సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారు, మండల అధికారులు ఎప్పుడు వస్తారన్న తేదీ కూడా వారికి చెబుతారు. ఆ రోజున వారిని క్యాంపులకు తీసుకు వచ్చి సమస్యలు పరిష్కరించేలా చూస్తారు.
♦ ఈ నెల రోజుల్లో క్యాంపుల సందర్భంగా మండల స్థాయి అధికారులతో కూడిన బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి ఈ సమస్యలను పరిష్కరించి, సరి్టఫికెట్లు ఇస్తారు. తాసీల్దార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈవో ఒక టీంగా, డిప్యూటీ తాసీల్దార్, ఎంపీడీఓ రెండో టీంగా ఏర్పడతారు.
♦ ప్రతి మండలంలో ప్రతిరోజూ రెండు సచివాలయాలు కవర్ అవుతాయి. జూలై 1 నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని దాదాపు 5.3 కోట్ల మంది పౌరులందరికీ చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను సందర్శించేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.
లక్షల మంది ఉద్యోగులు, వలంటీర్లు
♦ రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా సురక్ష క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. పేదవాడికి సాయం చేయడం కోసం సచివాలయాల సిబ్బంది, ఉద్యోగులు, వలంటీర్లు సహా లక్షల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, 2.60 లక్షల మంది వలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారు.
♦ 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇతర అధికారులు అన్ని క్యాంపుల్లో పాల్గొంటారు. అక్కడ సేవలు అందుతున్న తీరుపై వీరు తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు. వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్ సెక్రటరీ కూడా మానిటరింగ్ చేస్తారు.
క్యాంపుల నిర్వహణలో జాగ్రత్తలు
♦ సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించేటప్పుడు సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీరు, భోజనం, కూర్చోవడానికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రతి క్యాంపును ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కచ్చితంగా సందర్శించాలి. లబ్దిదారులకు క్యాంపుల గురించి సరైన సమాచారం అందించాలి.
♦ జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలను ఇదే కార్యక్రమంలో మిళితం చేసి వాటిని కూడా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వాళ్లు అడిగింది సాధ్యం కాని పరిస్థితులు ఉంటే ఆ విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి. దాన్ని కూడా జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగం చేసుకోవాలి. రెవెన్యూ డివిజన్ల వారీగా కూడా ఈ కార్యక్రమంపై పర్యవేక్షణ అవసరం. ఈ అంశంపై కూడా కలెక్టర్లు ధ్యాస పెట్టాలి.
♦ ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, గృహ నిర్మాణ శాఖ ఎండి జి లక్ష్మీషా, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అదనపు డైరెక్టర్ భావన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అప్పుడు, ఇప్పడు పరిస్థితి గమనించండి
♦ నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వంలో పరిస్థితులను చూడండి. ఏ పట్టణాన్ని, ఏ గ్రామాన్ని, ఏ వార్డును తీసుకున్నా.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. మరో వైపు వివక్షకు గురవుతూ ప్రజలు ఇబ్బంది పడేవారు. మీరు ఏ పార్టీ వారనే ప్రశ్న ఎదురయ్యేది.
♦ మనం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. ఇప్పుడు పెన్షన్ కావాలన్నా.. రేషన్ కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చే గొప్ప వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఆరు నెలల్లోనే దాదాపు 600 రకాల పౌరసేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల ముంగిటకు తీసుకు వచ్చాం.
♦ అర్హతే ప్రామాణికంగా కులం, మతం, పార్టీ చూడకుండా, రాజకీయాలకు తావే లేకుండా.. ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా పౌర సేవలు అందించడం మన ప్రభుత్వంలోనే మొదలైంది.
♦ అందువల్లే ఇవాళ ప్రతిపక్షాలకు అజెండా అన్నది మిగల్లేదు. ఇంతకు ముందు రేషన్ కార్డులు కావాలని, ఇళ్ల పట్టాలు కావాలని, పెన్షన్లు కావాలని.. ఉద్యమాలు జరిగే పరిస్థితులు ఉండేవి. ఈ రోజు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, బర్త్, ఇన్‌కం, డెత్, ఇన్‌కం సర్టిఫికెట్లు గ్రామ స్థాయిలోనే అందుతున్నాయి.
♦ ఈ నాలుగేళ్లలో నవరత్నాల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో డీబీటీ ద్వారా నేరుగా జమ చేశాం. నాన్ డీబీటీలో ఇళ్ల స్థలాల విలువ కూడా కలుపుకుంటే అది రూ.3.10 లక్షల కోట్లు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment