వలంటీర్లతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే, గంజి చిరంజీవి
మంగళగిరి : రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్‌ను సీఎం జగన్ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి, నిడమర్రులో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ రూ.5 వేల పింఛన్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయారైన పరిస్థితులను చూశామన్నారు.
రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పాటు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలేకపోయాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment