దొంగతనం చేశారు. దొరికిపోయారు. ఎవరైనా ఏం చేస్తారు? తాము తెలియక చేశామనో, అలా చేయటం తప్పని తమకు తెలియదనో కవర్ చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ అడ్డంగా దొరికిపోయాక.. ఆ దొంగతనాన్ని సమర్థించుకుంటూ ‘ఈనాడు’ చేస్తున్న వాదనేంటో తెలుసా? తమకు వస్తువులు కనిపించకుండా రహస్యంగా ఉంచారు కాబట్టి దొంగతనం చేయాల్సి వచ్చిందని!!. ఔరా... ఇదేం పాత్రికేయం!?
సాక్షి, అమరావతి: మరీ ఇంత బరితెగింపా? నకిలీ జీవోలను సృష్టించి... వాటిని విస్తృతంగా ప్రచారం చేసి... చివరకు తాము దొరికిపోయామని తెలియటంతో ఎదురు తిరుగుతోంది ఎల్లో మీడియా!!. జీవోలన్నీ రహస్యంగా ఉంచటం వల్లే ఇలా అవుతోందని, రహస్య పాలన వల్లే ఇలా రచ్చ జరుగుతోందని... ఇలా చేతికొచ్చినట్లు ఏదేదో రాసేసింది ‘ఈనాడు’ పత్రిక.
ఇంతకన్నా దారుణం ఉంటుందా? తప్పు చేశామని తెలిశాక... ఆ తప్పు బయట పడ్డాక కూడా ఒప్పుకోవటానికి సిగ్గెందుకు రామోజీరావు గారూ!? అయినా ఉన్నట్టుండి ఇలా ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లుగా ఒక నకిలీ జీవోను సృష్టించి... అప్పటికప్పుడు సోషల్ మీడియాతో పాటు ‘ఈటీవీ’తో ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ఎందుకు ప్రసారం చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ‘యువగళం’ పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర ఆరంభించారు.
తొలిరోజే ఆ యాత్ర భవిష్యత్ ఏంటో తెలిసిపోయింది. సభకోసం కర్ణాటక నుంచి బస్సుల్లో తెచ్చిన జనం కూడా లోకేశ్ మాట్లాడటం ఆరంభించగానే తిరిగి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగం పూర్తయ్యేసరికే సభాస్థలం ఖాళీ అయిపోయింది. దీంతో ఏదో ఒక మాయోపాయం ఆలోచించకపోతే లోకేశ్ పాదయాత్ర చేస్తున్న విషయాన్ని కూడా ఎవ్వరూ గుర్తించరని భావించిన ‘ఈనాడు’, దాని ఎల్లో తోకలు ఈ నకిలీ జీవో దారుణానికి ఒడిగట్టారు.
రిటైర్మెంట్ వయసు పెంచటం ద్వారా ఉన్నవారికే పొడిగింపు ఇస్తూ.. ఉద్యోగాలను ఆశిస్తున్న యువతకు గండి కొడుతున్నారని ప్రచారం చేసి... వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేశాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం అది నకిలీదని చెప్పటంతో పాటు దాని కారకులను పట్టుకోవటానికి కేసు కూడా నమోదు చేయటంతో... ఎల్లో మీడియా ఎదురుదాడికి దిగింది.
టీడీపీ శ్రేణులు ప్రచారం చేసిన నకిలీ జీవో
గెజిట్ వెబ్‌సైట్లో చూడలేదా?
ప్రతి జీవోనూ రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ ఈ గెజిట్’ వెబ్‌సైట్‌లో పెడుతున్నప్పటికీ రహస్య పాలనంటూ చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి రామోజీరావు నానా అవస్థలూ పడ్డారు. తెలుగుదేశం కోసం ఇలా నకిలీ జీవోలను తయారు చేసి ప్రచారం చేయటమంటే నకిలీ నోట్లు తయారు చేయటంలాంటిదేనని పలువురు అధికారులు వ్యాఖ్యానించటం గమనార్హం.
నకిలీ జీవోను ప్రసారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈటీవీ
ఇప్పటిదాకా ఉద్యోగులను రెచ్చగొట్టే చర్యలో భాగంగా టీడీపీ, ఎల్లో మీడియా కలిసి జీతాలు ఇవ్వడం లేదంటూ తీవ్రమైన దుష్ప్రచారం చేశాయి. దాన్ని ఆధారాలతో సహా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఖండించారు. ఇక ఇప్పుడు యువగళం పేరుతో లోకేశ్ యాత్ర చేస్తుండటంతో యువతను రెచ్చగొట్టడానికి ఈ నకిలీ జీవో కుట్రకు తెరతీశారు.
చంద్రబాబు హయాంలో రాజధాని భూములు 99 ఏళ్లకు లీజుకు ఇవ్వడం, సీబీఐని రాష్ట్రానికి రాకుండా నిషేధించడం వంటి రహస్య జీవోలు వందలకొద్దీ ఇచ్చినా... నాడు ‘ఈనాడు’గానీ, దాని తోక మీడియా గానీ ఒక్కసారైనా ప్రశ్నించకపోవటమే ఇక్కడ అన్నిటికన్నా విచిత్రం.
బాబు కాన్ఫిడెన్షియల్ జీవోల మాటేంటి?
ఏపీ బిజినెస్ రూల్స్, సచివాలయం మాన్యువల్ ప్రకారం... ఏ వ్యవహారం ఎలా జరగాలన్నది స్పష్టంగా ఉంటుంది. సంబంధిత సమాచారం రహస్యమా, అతి రహస్యమా, లేక రొటీనా అన్న విషయాన్ని సంబంధిత శాఖ కార్యదర్శే నిర్ణయిస్తారు. చంద్రబాబు హయాంలో జీవో పెట్టి.. అందులో కేవలం నంబర్ మాత్రమే పెట్టి. ఎలాంటి సమాచారం లేకుండా కాన్ఫిడెన్షియల్ అని పేర్కొన్న సందర్భాలు కోకొల్లలు.
అప్పట్లో దాదాపుగా ప్రతి జీవో కాన్ఫిడెన్షియలే!!. కానీ అది చంద్రబాబు కనక ‘ఈనాడు’గానీ, దాని తోకలు గానీ ఏనాడూ ప్రశ్నించలేదు. అయినా నిజానికి ఏ జీఓ అయినా గెజిట్‌లో పబ్లిష్ అయితేనే అది అధికారికంగా అమల్లోకి వచ్చినట్టు. గెజిట్ అనేది బహిరంగం. అది ఎవరైనా చూడొచ్చు. రహస్యమేమీ ఉండదు. దానికన్నా ముందు జీవో ఐఆర్‌లో ఏది పెట్టినా.. అది అధీకృతం కాదు.
ఎవరి సంతకాలూ ఉండవు కనక అది నిర్ధారించిన సర్టిఫైడ్ పత్రం కాదు. కానీ ‘ఏపీ ఈ గెజిట్’లో సంతకం చేసిన ఉత్తర్వులన్నింటినీ పెడుతున్నారు. ఇందులో సెక్షన్ అధికారి పత్రం కూడా ఉంటోంది. ఈ సమాచారం అధికారికం కూడా.
మరి నిన్నటి నకిలీ జీవో వ్యవహారంలో కనీసం ఎవ్వరినైనా సంప్రదించారా? ఇందులో ఉన్నది మామూలు రొటీన్ అంశమేమీ కాదు కదా? లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంకదా? కనీసం ధ్రువీకరించుకోవాల్సిన పని లేదా? సంబంధిత శాఖతో మాట్లాడి.. వారి నుంచి వివరణ తీసుకోవాలి కదా? అలాంటివేమీ లేకుండా... అబద్ధాన్ని మీరే సృష్టించి... మీరే ప్రచారం చేసి... ప్రచారంలో ఉంది కాబట్టి ప్రసారం చేశామనటం ఏ రకమైన న్యాయం? పైపెచ్చు కప్పిపుచ్చుకోవటానికి ఏకంగా ప్రభుత్వ పాలన తీరుపైనే నిందలా? జనం ఇవన్నీ గమనిస్తున్నారు రామోజీరావు గారూ!!.
Comments
Please login to add a commentAdd a comment