
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం దర్యాప్తును సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేదా ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించినా అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
ఈ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో పలు చిక్కులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌లో పేర్కొంది. మనీలాండరింగ్ కూడా జరిగిందని వివరించింది. సీఆర్‌డీఏ పరిధిలో జరిగిన అసైన్డ్ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణాలపై 2020లోనే సీఐడీ దర్యాప్తు చేపట్టిందని, వీటిపై దర్యాప్తు చేయాలని సీబీఐని కూడా కోరినట్లు తెలిపింది.
సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపామంది. ఇందుకు జీవోలు కూడా జారీ చేశామని తెలిపింది. ఉండవల్లి వ్యాజ్యంలో కోర్టు ఏ ఆదేశాలు జారీ చేసినా కట్టుబడి ఉంటామని తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ తెలిపారు.
ఇతర మార్గాల్లోనోటీసులు పంపేందుకు అనుమతివ్వండి
నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కొందరికి అందాయని, కొందరు తిరస్కరించారని, డోర్ లాక్, ఇంట్లో లేరు వంటి కారణాలతో కొన్ని వెనక్కి వచ్చాయని ఉండవల్లి తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వివరించారు. నోటీసులు అందని వారికి పత్రికలు, వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపేందుకు అనుమతివ్వాలని కోరారు.
సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇప్పటి వరకు సీఐడీ చేసిన దర్యాప్తు వివరాలతో ఓ నివేదికను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్లాక నివేదికపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. నోటీసులు అందని వారికి వాటిని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment